హైదరాబాద్, వెలుగు: ములుగు వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు అందించేందుకు ఎయిమ్స్ బీబీనగర్ బృందం ముందుకు రావడం అభినందనీయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ములుగు, ఏటూరునాగారంలో తొలిదశలో శాటిలైట్ హెల్త్ సెంటర్లను ప్రారంభించాలని, టెలీమెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మంగళవారం ఆమె బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ను సందర్శించి, ములుగు జిల్లాలో వైద్య సేవల విస్తరణ, ఆస్పత్రుల నిర్మాణంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మతం, కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందడం ప్రాథమిక హక్కు అన్నారు. ఎయిమ్స్ బీబీనగర్, సమ్మక్క– సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ములుగులో గిరిజన ఆరోగ్య పరిరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు.
స్థానిక ఆదివాసీ యువతకు ప్రాథమిక వైద్య శిక్షణ ఇచ్చి ఆరోగ్య కార్యకర్తలుగా తీర్చిదిద్దడం వల్ల ప్రజలకు సేవలు మరింత చేరువవుతాయని చెప్పారు. రక్తహీనత, పోషకాహార లోపం, సికిల్ సెల్, మలేరియా వంటి సమస్యల నివారణపై దృష్టి పెట్టాలని సూచించారు.
కోయ, గోండి, లంబాడీ భాషల్లో ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఈడీ ప్రొఫెసర్ అమితా అగర్వాల్, గిరిజన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్, డీన్లు, వైద్యులు పాల్గొన్నారు.
