ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ విజయశాంతి విజ్ఞప్తి

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ విజయశాంతి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలని ఎమ్మెల్సీ విజయశాంతి రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శాసన మండలి సమావేశాల్లో తాను ఈ విషయంపై మాట్లాడానని, సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఓ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. 

ఆ కమిటీ వెంటనే సీఎంకు నివేదిక ఇవ్వాలని సూచించారు. హామీల అమలులో ఏమాత్రం ఆలస్యం జరిగినా జనగామ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ వంటి ఆత్మహత్య ఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

లక్ష్మణ్ గౌడ్ సూసైడ్​తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇలాంటి ఉద్యమకారుల అకుంఠిత దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని తెలిపారు. అందుకే ఉద్యమంలో పాల్గొన్న వారికి  ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఆమె కోరారు.