- హైకోర్టు మొట్టికాయలతో దిగొచ్చిన దేవాదాయ శాఖ
హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మొక్కు వస్త్రాల సేకరణ లైసెన్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా గతంలో ఇచ్చిన మూడేండ్ల పొడిగింపును ప్రభుత్వం రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో దేవాదాయ శాఖ వెనక్కి తగ్గింది. కొత్తగా టెండర్ కమ్ పబ్లిక్ ఆక్షన్ నిర్వహించాలని దేవస్థానం ఈవో జె.భవానీ శంకర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. పారదర్శకత, ఆలయ ఆదాయ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
లైసెన్స్ పొడిగింపుపై పోరాటం
యాదగిరిగుట్ట కొండపై, పాతగుట్టలో భక్తులు సమర్పించే మొక్కు వస్త్రాల సేకరణకు 2025 ఫిబ్రవరి 6న టెండర్ కమ్ పబ్లిక్ ఆక్షన్ నిర్వహించారు. ఇందులో డి.నాగరాజు లైసెన్స్ దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు మాత్రమే లైసెన్స్ గడువు ఉంది. అయితే, 2025 ఆగస్టు 29న దేవాదాయ శాఖ కమిషనర్ ఆ లైసెన్స్‌ను రెండేండ్లు పొడిగించారు. ఏడాది కాలానికి ఇచ్చిన లైసెన్స్‌ను టెండర్లు లేకుండా మూడేండ్లకు పొడిగించడంపై విమర్శలు వచ్చాయి. ఈ పొడిగింపుపై స్థానికుడు అన్నదాస్ వెంకటేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని 2026 ఏప్రిల్ 14, జూన్ 28 తేదీల్లో దేవస్థానం అధికారులకు వినతిపత్రాలిచ్చారు. అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 23న పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఆయన వినతులను పరిశీలించి, గడువులోగా నిర్ణయం తీసుకోవాలంది. దీంతో దేవాదాయ శాఖ పొడిగింపు ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. అక్టోబర్ 8న ప్రభుత్వం కూడా మెమో ద్వారా రద్దుకు ఆమోదం తెలిపింది.
పాత కాంట్రాక్టర్‌కు హక్కులు లేవు
హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ ఆమోదం ఆధారంగా ఈవో భవానీ శంకర్ కొత్త ప్రొసీడింగ్స్ జారీ చేశారు. పాత లైసెన్స్ గడువు 2026 మార్చి 31తోనే ముగిసిందని, ఇక పొడిగింపు హక్కులు అమల్లో లేవని స్పష్టం చేశారు. అప్పటి నుంచి మొక్కు వస్త్రాల సేకరణ, బహిరంగ వేలం ద్వారా అమ్మకాలను దేవస్థానమే నిర్వహిస్తోంది. అవసరమైన చట్టబద్ధ అనుమతులు తీసుకుని కొత్త టెండర్ కమ్ పబ్లిక్ ఆక్షన్ చేపట్టనుంది. ఇందులో ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు, ప్రాధాన్యతలు ఉండవు. అర్హులైన వారంతా సమాన నిబంధనలతో పాల్గొనవచ్చని ఈవో పేర్కొన్నారు. పాత కాంట్రాక్టర్‌కు ఇక ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేశారు
