- వర్సిటీలు, అఫిలియేటెడ్ కాలేజీల తీరుపై టీజీసీహెచ్‌ఈ సీరియస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అనుబంధ కాలేజీల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందిని ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా విధుల నుంచి తొలగించడంపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగించొద్దని స్పష్టం చేసింది. కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల రిజిస్ట్రార్లకు టీజీసీహెచ్‌ఈ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ లేఖ రాశారు.
వివిధ కాలేజీలు, యూనివర్సిటీల యాజమాన్యాలు కనీస సమాచారం గానీ, ముందస్తు నోటీసులు గానీ ఇవ్వకుండానే లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బందిని సర్వీసు నుంచి తొలగిస్తున్నాయని పలువురు బాధితులు కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకుండా సాగుతున్న ఈ తొలగింపులపై స్పందించిన కౌన్సిల్.. వర్సిటీల రిజిస్ట్రార్లను అప్రమత్తం చేసింది. సిబ్బందిని విధుల నుంచి తొలగించడం పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నది.
