వరంగల్ కి చెందిన బీటెక్ విద్యార్థిని వైష్ణవి మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లోని ట్రిపుల్ ఐటీ డీఎం యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడ సంగతి తెలిసిందే. వైష్ణవి మృతికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నరావుపేట మండలం పాపయ్యపేటకు శివారు అమ్ము తండాకు చెందిన బోడ సుమన్ వైష్ణవి మృతికి కారణమంటూ ఆరోపిస్తున్నారు బంధువులు. జాబ్ కోసమని సుమన్ పని చేస్తున్న కంపెనీకి వైష్ణవి రెజ్యూమ్ పంపిందని.. ఒకే ఏరియాకు చెందినవారమంటూ మాట కలిపి సుమన్ మోసం చేయడంతోనే వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు బంధువులు.
వైష్ణవి మృతదేహంతో సుమన్ ఇంటి దగ్గర ధర్నాకు దిగారు బంధువులు. ఈ క్రమంలో వైష్ణవి బంధువులను అడ్డుకొని మృతదేహాన్ని బుచ్చినాయక్ తండాకు తరలించారు పోలీసులు. వైష్ణవి మృతికి కారణమైన సుమన్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు కుటుంబసభ్యులు, బంధువులు.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బుచ్చి నాయక్ తండాకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ వైష్ణవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ లో ఆత్మహత్య చేసుకుంది. తండాకు చెందిన వాంకుడోత్ సమ్మయ్య, కమల దంపతుల పెద్ద కూతురు వైష్ణవి జబల్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లో థర్డ్ ఇయర్ చదువుతుంది.
సోమవారం మధ్యాహ్నం ఆమె హాస్టల్ గదిలో నుంచి బయటకు రాకపోవడంతో ఫ్రెండ్స్ కు అనుమానం వచ్చింది. హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో గది తలుపులు పగలగొట్టి చూశారు. అప్పటికే వైష్ణవి ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది.
పోలీసుల సమాచారంతో బుచ్చి నాయక్ తండా నుంచి వైష్ణవి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం జబల్పూర్ కు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైష్ణవి మృతి పట్ల తమకు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.
