జగిత్యాల బాలుడి దత్తత కేసులో బిగ్ ట్విస్ట్..! కథ సుఖాంతం అయ్యిందనుకుంటే... మళ్ళీ కోర్టుకెళ్లిన అధికారులు..!

జగిత్యాల బాలుడి దత్తత కేసులో బిగ్ ట్విస్ట్..! కథ సుఖాంతం అయ్యిందనుకుంటే... మళ్ళీ కోర్టుకెళ్లిన అధికారులు..!

ఇటీవల సంచలనంగా మారిన జగిత్యాల బాలుడి దత్తత కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేశారు అధికారులు. హైకోర్టు ఆదేశాల మేరకు బాలుడిని శ్రీనివాస్, సరిత దంపతులకు అప్పగించినప్పటికీ వివాదంపై కొనసాగుతున్న విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

హిందూ దత్తత మరియు భరణ చట్టం–1956 నిబంధనలు పాటించారా లేదా అనే అంశం పరిశీలించాలని రిట్ పిటిషన్లో హైకోర్టును కోరారు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. అప్పీల్ పరిష్కారమయ్యే వరకు బాలుడిని తగిన రక్షణ సంరక్షణలో ఉంచాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు అధికారులు. గతంలో బాలుడిని అప్పగించాలని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని హైకోర్టును కోరారు జిల్లా అధికారులు.దీంతో సుఖాంతం అయ్యిందని అనుకున్న బాలుడి దత్తత వ్యవహారంలో మళ్ళీ సస్పెన్స్ నెలకొంది.

నిబంధనల ప్రకారం దత్తత ప్రక్రియ జరగలేదని 24 ఆగస్టు 2026న చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫిర్యాదు అందడంతో బాలుడిని దాదాపు రెండు నెలల పాటు తమ సంరక్షణలో ఉంచుకున్నారు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు.దత్తత తీసుకున్న కాసారపు సరిత, శ్రీనివాస్ దంపతుల న్యాయ పోరాటంతో ఇటీవల తిరిగి  దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు బాలుడిని అప్పగించారు అధికారులు.