నేను అనాథను.. నా పెళ్లికి బంధువులుగా రండి: రాజుగారి పెళ్లిని తలపించే రీతిలో తరలివచ్చిన జనం !

నేను అనాథను.. నా పెళ్లికి బంధువులుగా రండి: రాజుగారి పెళ్లిని తలపించే రీతిలో తరలివచ్చిన జనం !

పెళ్లంటే నూరేళ్ల పంట అంటుంటారు. అలాంటి పెళ్లికి.. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో పందిరి వేయకపోయినా పర్లేదు.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా పెళ్లి జరగకపోయినా వచ్చిన నష్టం ఏం లేదు. కానీ.. నిండునూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండమని దీవించే నలుగురు సన్నిహితులు మాత్రం పెళ్లిలో కచ్చితంగా ఉండాలి. ఆ నలుగురు కూడా లేకపోతే.. ఎంత బాధగా ఉంటుందో అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. చైనాలో ఒక యువకుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

యునాన్ ప్రావిన్స్‌లోని యిలియాంగ్ కౌంటీకి చెందిన 24 ఏళ్ల జు చెంగ్‌హాంగ్ అనే యువకుడి పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. చెంగ్ హాంగ్కు మూడేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. తల్లి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లి పోయింది. అతనిని పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ కూడా చనిపోయింది. అతనికి తన అన్నయ్య తప్ప ఎవరూ లేరు. అతనికి ఈ మధ్యే తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కుదిరింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by In Zhejiang (@inzhejiang)

అతనికి తన అన్నయ్య తప్ప అయినవాళ్లంటూ ఎవరూ లేరు. దేశం ఏదైనా డబ్బుంటేనే బంధువులు చుట్టూ ఈగల్లా ముసురుతారు. చెంగ్ హాంగ్ ఇందుకు మినహాయింపేమీ కాదు. అతనికి బంధువులు ఉన్నా లేనట్టే. తన పెళ్లి కోసం పైసా పైసా దాచుకుని 1,67,500 యువాన్‌లను కూడబెట్టాడు. పెళ్లి చేసుకోవడానికి ఉన్నంతలో డబ్బు ఉంది. ప్రేమించిన అమ్మాయి తనతో ఉంది. కానీ.. అతిథులే లేరు.

జు చెంగ్‌హాంగ్కు శ్రేయోభిలాషులు లేకుండా పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఈ క్రమంలో అతనికి ఒక వినూత్న ఆలోచన వచ్చింది. తన పెళ్లికి అతిథులుగా తనకు ఏమాత్రం పరిచయం లేని వారినే పిలవాలని భావించాడు. తన పెళ్లికి ముందు చైనా షార్ట్-వీడియో ప్లాట్‌ఫామ్ అయిన డౌయిన్‌లో ఒక ఓపెన్ ఇన్విటేషన్ పోస్ట్ చేశాడు. తన పరిస్థితిని వివరించి తన పెళ్లికి అతిథులుగా రావాలని ఆహ్వానించాడు. అతని ఆహ్వానంలో ఉన్న నిజాయతీ నచ్చి వందల్లో కాదు వేలల్లో అతని పెళ్లికి తరలివెళ్లారు. భోజనాలు, డెకరేషన్.. ఇలా పెళ్లికి సంబంధించిన ప్రతీ పనిని దగ్గరుండి చూసుకున్నారు. అంతేకాదు.. వచ్చిన వాళ్లలో చాలా మంది వధూవరులకు గిఫ్ట్స్ తెచ్చారు.

ఊహించని ఈ పరిణామంతో వధూవరుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 10 వేల మందికి చైనా ప్రజలు పైగా ఈ పెళ్లికి హాజరయ్యారు. వేల మంది ముందు ఉంగరాలు మార్చుకుని, తమకు ఏమీ కాకపోయినా ఇంత చేసిన అతిథులకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తల వంచి నమస్కరించారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సోషల్ మీడియా అంటేనే టాక్సిక్గా మారిన ఈరోజుల్లో ఈ ఘటన వేల మంది హృదయాలను తాకింది.