అమెరికా మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి ఎదురుగాలి వీయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. డెమొక్రాట్లు భారీ విజయాలు సాధించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ధిక్కార స్వరాన్ని వినిపించారు.
ఒకవేళ బ్యాలెట్ పేపర్లో తన పేరు ఉండి ఉంటే, రిపబ్లికన్లు భారీ మెజారిటీతో గెలిచి ఉండేవారని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ‘‘నా పేరు బ్యాలెట్లో లేదు, ఒకవేళ ఉండి ఉంటే మనం భారీ మెజారిటీతో గెలిచి ఉండేవాళ్ళం.. మధ్యంతర ఎన్నికలపై మీరు చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు," అని రిపబ్లికన్ పార్టీ కేడర్‌ను ఉద్దేశించి ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ రాశారు.
#USMidtermElections | President of the United States Donald Trump posts on Truth Social; "I wasn’t on the Ballot and if I was, we would have won in a landslide..." https://t.co/8xkCPTPKPM
— ANI (@ANI) November 4, 2026
రిపబ్లికన్ అభ్యర్థుల కోసం జరిగిన పలు ర్యాలీలలో, ట్రంప్ ఓటర్లను ఉద్దేశించి, తాను బ్యాలెట్లో ఉన్నట్లుగా భావించి ఓటు వేయమని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అయితే.. ట్రంప్ అభ్యర్థనను అమెరికా ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదని ఫలితాలతో స్పష్టమైంది. అధ్యక్షుడిగా తన పనితీరుపై ఈ మధ్యంతర ఎన్నికలను ప్రజాభిప్రాయ సేకరణగా పరిగణించాలని ఓటర్లకు ట్రంప్ పదేపేదే చెప్పారు.
ఓటర్లు ఇచ్చిన తీర్పు చూస్తుంటే ట్రంప్ పాలనపై అమెరికా ఓటర్లు అసంతృప్తితో ఉన్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాలను చూసుకుంటే.. డెమోక్రాట్లు సత్తా చాటుతున్నారు. రిపబ్లికన్ల కంచుకోటలను కూడా బద్ధలు కొట్టి ఘన విజయం దిశగా దూసుకెళుతున్నారు. అమెరికా పార్లమెంట్ ను చేజిక్కించుకునే దిశగా డెమోక్రాటిక్ పార్టీ సంచలన విజయానికి అడుగు దూరంలో నిలిచింది.
ఈ ఏడాది జరిగే మధ్యంతర ఎన్నికల్లో తానే బ్యాలెట్లో ఉన్నట్లుగా భావించుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటర్లకు చెప్పారు. ఓటర్లు అలాగే భావించి ఓటేశారు. ట్రంప్ విధానాలను, రిపబ్లికన్ పార్టీని కూడా ఓటర్లు ఛీ కొట్టారు. ట్రంప్ అజెండాను ఓటర్లు బలంగా తిరస్కరించడంతో పాటు, ఆయన పరిపాలనపై నియంత్రణలు విధించడానికి కాంగ్రెస్ తగినంతగా కృషి చేయలేదని, అలాగే ధరలు, అవినీతి సమస్యలను పరిష్కరించడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమైన సందేశం ఇచ్చారు. డెమోక్రాట్లు కాంగ్రెస్‌పై (అమెరికా పార్లమెంట్) పూర్తి నియంత్రణను సాధించే దిశగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత డెమోక్రాట్లు తమ అతిపెద్ద మెజారిటీని సాధించబోతున్నారు.
అయోవా, కాన్సాస్, ఒహాయో, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, టెక్సాస్‌లలో రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న ఐదు స్థానాలను డెమొక్రాట్లు ఇప్పటికే కైవసం చేసుకున్నారు. టెక్సాస్‌ను ఎలాగైనా దక్కించుకోవాలన్న డెమోక్రాట్ల కల నిజమైంది. ఈ రాష్ట్రాలలో చాలా వరకూ ట్రంప్ స్వయంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. అయినప్పటికీ ట్రంప్ పార్టీ అభ్యర్థులకు ఓటర్ల నుంచి వ్యతిరేకత మూటగట్టుకోక తప్పలేదు. ట్రంప్ పాలనపై, నిరంకుశ విధానాలపై అమెరికా ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చేశారు.
