ఒక్కరోజే 5 లక్షల మందికి ఉపాధి!..వీబీ జీ రామ్‌‌‌‌జీ స్కీమ్ లో ఆల్‌‌‌‌టైమ్ రికార్డు

ఒక్కరోజే 5 లక్షల మందికి ఉపాధి!..వీబీ జీ రామ్‌‌‌‌జీ స్కీమ్ లో ఆల్‌‌‌‌టైమ్ రికార్డు
  • 53 వేలకు పైగా కూలీలతో నల్గొండ టాప్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వీబీజీ రామ్‌‌‌‌జీ స్కీమ్​అమలులో ఆల్​టైమ్​రికార్డు నమోదైంది. సాధారణంగా వేసవిలోనే కూలీల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈసారి నవంబర్‌‌‌‌లోనే రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఒకేరోజు ఏకంగా 5 లక్షల మందికి పైగా కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. నవంబర్ నెలలో ఈ స్థాయిలో పని కల్పించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని 31 గ్రామీణ జిల్లాల పరిధిలో మొత్తం 59,861 పనుల్లో 1,31,142 మస్టర్ రోల్స్ ద్వారా రికార్డు స్థాయిలో 5,00,166 పనిదినాలు నమోదైనట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ వెల్లడించింది.

అత్యధికంగా 53,280 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరై నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మెదక్ జిల్లా 27,296 మందితో రెండో స్థానంలో నిలవగా, సిద్దిపేట 23,845, వికారాబాద్ 23,731, సంగారెడ్డి 22,222, కామారెడ్డి 21,178,  నిజామాబాద్ 20,912 జిల్లాలు 20 వేలకు పైగా కూలీలతో ముందంజలో ఉన్నాయి. ఇక వరంగల్, ఖమ్మం, హనుమకొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 10 వేలలోపే హాజరు నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద మట్టి పనులకే పరిమితం కాకుండా భూగర్భ జలాల పెంపుతోపాటు శాశ్వత ఆస్తుల సృష్టి లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. 

జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి సీతక్క

ఒకే రోజు 5 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో మరిన్ని పనిదినాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ ద్వారా కూలీ కల్పించడమే కాకుండా, గ్రామాల్లో దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే పనులపై దృష్టిపెట్టాలన్నారు.