- సివిల్ ఇంజినీరింగ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై చర్చ
హైదరాబాద్, వెలుగు: సివిల్ ఇంజినీరింగ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ ఇండియా (ఏసీసీఐ) ఆధ్వర్యంలో ‘రైడ్స్–2026’ పేరిట జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ)లో నవంబర్ 26, 27 తేదీల్లో ఈ సదస్సుతో పాటు బిల్డ్-టెక్ ఎక్స్పో–2026 కూడా జరగనుంది. సోమవారం ఎర్రమంజిల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఏసీసీఐ హైదరాబాద్ సెంటర్ ప్రతినిధులు ఈ సదస్సుకు సంబంధించిన లోగోలను ఆవిష్కరించారు.
దేశంలోని సివిల్ ఇంజినీర్లలో నైపుణ్యాలను పెంపొందించడం, నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లతో పాటు ఆధునిక సాంకేతికతలపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని నిర్వహకులు తెలిపారు. ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి భారత్తో పాటు చైనా, దుబాయ్, జపాన్ తదితర దేశాల నుంచి 12 మంది ప్రముఖ అంతర్జాతీయ నిపుణులు హాజరై ప్రసంగించనున్నారు. అలాగే దేశవిదేశాల నుంచి 1,000 మందికిపైగా సివిల్, స్ట్రక్చరల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొననున్నారు.
