- తొలిసారిగా కొత్తగూడెం ఏరియాలోని బొగ్గు గనులు, విభాగాల్లో ప్రారంభం ..
- ఫ్రీ మస్టర్లకు చెక్ పెట్టేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు
కోల్‌బెల్ట్, వెలుగు: సాంకేతికత వినియోగంలో ముందుండే సింగరేణి సంస్థ ఉద్యోగులు, కార్మికుల హాజరు నమోదులోనూ ఆధునిక విధానాల అమలుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొత్తగూడెం సింగరేణి ఏరియా పరిధిలోని అన్ని బొగ్గు గనులు, విభాగాల్లో ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమల్లోకి తీసుకొచ్చింది.
సింగరేణి చరిత్రలో ఒక ఏరియా పరిధిలోని అన్ని గనులు, విభాగాల్లో ఒకేసారి ఈ విధానాన్ని అమలు చేయడం విశేషం. ఈ విధానంతో ఉద్యోగులు విధులకు హాజరైనప్పుడే మస్టర్ నమోదవుతుంది. హాజరు ప్రక్రియలోనూ పారదర్శకత పెరగడంతో పాటు సమయపాలన, క్రమశిక్షణ మెరుగుపడతాయని యాజమాన్యం భావిస్తోంది. ముఖ్యంగా గనుల్లో కొనసాగుతున్న ఫ్రీ మస్టర్లకు అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
కొనసాగుతున్న బయోమెట్రిక్విధానం..
గతంలో ఉద్యోగులు తమ ఎంప్లాయ్ కోడ్ చెబితే క్లర్కులు మాన్యువల్‌గా ఇన్, ఔట్ హాజరు నమోదు చేసేవారు. ఈ విధానంలో కొందరు విధులకు హాజరుకాకుండానే మస్టర్లు వేయించుకున్నట్లు విచారణల్లో వెల్లడైంది. దీంతో యాజమాన్యం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
కొవిడ్ సమయంలో టెంపరరీగా నిలిపివేయగా, 2023 ఆగస్టు నుంచి ఈ విధానం తిరిగి అమల్లోకి వచ్చింది. అయితే భూగర్భ, ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల్లో మాత్రం పాత పద్ధతిలోనే క్లర్కుల ద్వారా హాజరు నమోదు కొనసాగుతోంది.
అన్ని ఏరియాలకు విస్తరించే యోచన
ఫ్రీ మస్టర్ల సమస్యకు పర్మినెంట్‌గా చెక్‌పెట్టేందుకు యాజమాన్యం ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్విధానంపై దృష్టి సారించింది. గతంలో కొత్తగూడెం ఏరియాలోని వీకే-7 అండర్‌గ్రౌండ్ మైన్‌లో పైలట్ ప్రాజెక్టకుగా ఈ విధానాన్ని అమలు చేయగా, కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో నిలిపివేశారు.
2024 మేలో జార్ఖండ్‌లోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) పరిధిలో ఈ విధానం అమలుపై అధ్యయనం చేసేందుకు సింగరేణి ఆఫీసర్లు, కార్మిక సంఘాల లీడర్లతో కూడిన బృందాన్ని పంపించారు. అక్కడి బోకారో, కర్గాలీ ఓపెన్‌కాస్ట్ గనుల్లో పరిశీలన జరిపి నివేదిక అందించారు.
తాజాగా కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సింగరేణి సంస్థలో దాదాపు 40 వేల మంది కార్మికులు ఉండగా, కొత్తగూడెం ఏరియాలో దాదాపు 1,600 మంది పనిచేస్తున్నారు. మొదటిరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాజరు నమోదు కావడంతో యాజమాన్యం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. త్వరలోనే సింగరేణిలోని మిగిలిన 11 ఏరియాల్లోనూ గనులు, స్టోర్స్, వర్క్‌షాప్‌లు, ఆస్పత్రులు, ఇతర విభాగాలకు ఈ విధానాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
