మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి

మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి

మణుగూరు: మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మహిళా ప్రయాణికురాలితో జరిగిన గొడవ ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన మహిళా బస్సు కండక్టర్ ప్రవళికకు చిల్లర విషయంలో మహిళా ప్రయాణికురాలితో వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన ప్రయాణికురాలు కదులుతున్న బస్సులో నుంచి ప్రవళికను బయటకు తోసేసింది.

బస్సు టైరు కింద పడటంతో తీవ్రంగా గాయపడిన ప్రవళికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. గత పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవళిక ఆరోగ్య పరిస్థితి ఈరోజు(బుధవారం) ఉదయం ఒక్కసారిగా క్షీణించింది. బీపీ పడిపోవడంతో పాటు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ప్రవళిక చనిపోయింది. ప్రవళిక మృతితో కుటుంబ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయింది.