- రాయదుర్గంలోని స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ అకౌంట్‌పై సైబర్ అటాక్
- సెలవు రోజున రెచ్చిపోయిన మోసగాళ్లు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)కి చెందిన స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ కార్పొరేట్(ఎస్ఎస్‌ఎల్) బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.7.80 కోట్లకు పైగా నగదును కొట్టేశారు. ఆదివారం సెలవు రోజున ఉదయం10.18 గంటల నుంచి సాయంత్రం 4.58 గంటల మధ్య 82 లావాదేవీల ద్వారా వివిధ బ్యాంకు ఖాతాలకు మనీ ట్రాన్స్ ఫర్చేశారు. ఆలస్యంగా గమనించిన స్ఫూర్తి ఫైనాన్షియల్ సంస్థ ప్రతినిధి మంగళవారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్పందన స్పూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్‌కు హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో కార్పొరేట్ అకౌంట్ ఉంది.
హెచ్‌ఎస్‌బీసీ అకౌంట్ నుంచి గుర్తు తెలియని బెనిఫిషరీ అకౌంట్లకు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌పేస్(ఏపీఐ) ద్వారా భారీ మొత్తాల్లో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. కొన్ని లావాదేవీల్లో రూ.49.99 లక్షలు, మరికొన్ని లావాదేవీల్లో రూ.35 లక్షలు, రూ.25 లక్షలు, రూ.20 లక్షల చొప్పున మొత్తం 7 కోట్ల 80 లక్షల 60 వేల రూపాయలు అనధికారికంగా బదిలీ అయ్యాయి. సోమవారం ఉదయం గమనించిన బ్యాంక్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు బ్యాంక్ ప్రతినిధి శిల్పాజైన్ 1930తో పాటు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఏపీఐను అనధికారికంగా యాక్సెస్ చేసినట్లు తెలిపారు. లావాదేవీలకు సంబంధించిన యూటీఆర్ నంబర్లను అందించారు. ఈ మేరకు సైబర్ సెక్యూరిటి బ్యూరో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
