నూనెగింజల సాగు విస్తరణకు కృషి: మంత్రి తుమ్మల

నూనెగింజల సాగు విస్తరణకు కృషి: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: దేశీయ వంటనూనెల అవసరాలను తీర్చేందుకు నూనెగింజల సాగును విస్తరించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంటనూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఆయిల్‌పామ్‌తో పాటు ఇతర నూనెగింజల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు మెరుగైన ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. గోద్రెజ్ సంస్థ దేశంలోనే తొలిసారిగా ఆరో తరం హైబ్రిడ్ ఆయిల్‌పామ్ విత్తనాల అభివృద్ధికి సీడ్ గార్డెన్ ఏర్పాటు చేయనుందని వెల్లడించారు.

నల్గొండ భూములపై స్టేటస్ కోదేవాదాయశాఖ అప్పీలుపై హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామంలోని వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సర్వే నంబర్లు 556, 557, 558, 585లోని భూములపై యథాతథస్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. దేవాదాయశాఖ దాఖలు చేసిన అప్పీలుపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను వాయిదా వేసింది. చింతపల్లి గ్రామంలోని 18 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదనే కారణంతో, దేవాదాయశాఖ అధికారుల అంతర్గత లేఖల ఆధారంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం కుదరదని సింగిల్ జడ్జి గతంలో తీర్పునిచ్చారు.

ప్రైవేటు వ్యక్తులు సమర్పించిన పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దేవాదాయశాఖ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆలయ నిర్వహణకు సంబంధించి181 ఎకరాల భూమి గట్టుపతి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందినదని, వాటిపై ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులూ లేవని దేవాదాయశాఖ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలుపై స్టే విధించింది .