మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లకు ప్రమోషన్లు!

మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లకు ప్రమోషన్లు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లకు ఎట్టకేలకు ప్రమోషన్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాయినింగ్ తర్వాత వారి సర్వీసు మొత్తంలోనూ ప్రమోషన్ చానల్ లేదు. దీంతో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఒక్క ప్రమోషన్ కూడా లేకుండానే ఒకే క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏళ్ల తరబడి మగ్గిపోయేవారు. ప్రిన్సిపాళ్లకు కెరీర్ గ్రోత్ కల్పించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఉన్నత క్యాడర్ పోస్టులు సృష్టించి, పదోన్నతులు కల్పించేలా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. 

194 మోడల్​స్కూళ్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో మోడల్ స్కూళ్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రస్తుతం 194 మోడల్ స్కూళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అమలులో ఉన్న సర్వీస్ నిబంధనల ప్రకారం.. టీజీటీగా చేరిన వారికి పీజీటీలుగా, పీజీటీలకు ప్రిన్సిపాళ్లుగా ప్రమోషన్​పొందే చానల్​ఉంది. అయితే, ప్రిన్సిపాల్ స్థాయికి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి పైస్థాయికి వెళ్లేందుకు ఎలాంటి ఉన్నత స్థాయి పోస్టులు లేవు. దీంతో ప్రిన్సిపాళ్లు తమ సర్వీస్​మొత్తం అదే హోదాలో పనిచేస్తూ రిటైర్​అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రోత్ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్న ప్రిన్సిపాళ్లకు ఊరటనిచ్చేలా విద్యాశాఖ పదోన్నతులకు ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. అయితే, ఇప్పటివరకు పీజీటీ, టీజీటీలకూ ప్రమోషన్లు ఇవ్వలేదు. వారికి ప్రమోషన్ చానల్ ఉండటంతో.. కొంచెం ఆలస్యమైనా పదోన్నతి పొందే అవకాశం ఉంది. 

ప్రతిపాదిత పోస్టులివే..

మోడల్ స్కూళ్ల కోసం ప్రత్యేకంగా 13 ఉన్నతాధికారి పోస్టులను మంజూరు చేయాలని విద్యాశాఖ సర్కారుకు ప్రతిపాదించింది. ఉమ్మడి జిల్లాకొకటి చొప్పున 10 రీజినల్ కోఆర్డినేటర్ పోస్టులను కేటాయించాలని కోరింది. సీనియారిటీ ఆధారంగా ప్రిన్సిపాళ్లను ఎంపిక చేసి పదోన్నతి కల్పిస్తారు. ఆయా పోస్టులతోపాటు హైదరాబాద్ మోడల్ స్కూల్ డైరెక్టరేట్ లోనూ 3 పోస్టులు ప్రతిపాదించారు. రెండు డిప్యూటీ డైరెక్టర్(అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్), ఒక జాయింట్ డైరెక్టర్(జేడీ అకాడమిక్) పోస్టును సృష్టించాలన్నారు. అయితే, ప్రభుత్వం ఇటీవల మోడల్ స్కూళ్లకు భారీగా పోస్టులను సాంక్షన్ చేసింది. ప్రస్తుతం జిల్లాల్లో వాటి భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త పోస్టులు అందుబాటులోకి వస్తే ప్రిన్సిపాళ్ల ప్రమోషన్ల సమస్య తీరడంతోపాటు, క్షేత్రస్థాయిలో మోడల్ స్కూళ్లపై పర్యవేక్షణ మరింత బలోపేతమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకో రీజినల్ కోఆర్డినేటర్ ఉండటంతో స్కూళ్ల పనితీరు, టీచర్ల అటెండెన్స్, అకాడమిక్ ఫలితాలు, విద్యార్థుల సమస్యలపై నిరంతరం సమీక్షించేందుకు వీలవుతుందని పేర్కొంటున్నారు.