హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండలం ఆకుతోటపల్లిలోని సర్వే నంబర్లు 302, 304లో క్వారీయింగ్ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ ముగించింది. అనుమతులపై అభ్యంతరాలుంటే అప్పిలెట్ అథారిటీని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.
పర్యావరణ అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే అనుమతులు ఇచ్చారని, పేలుళ్లు, దుమ్ము, కాలుష్యంతో గ్రామస్తులకు ఇబ్బందులు కలుగుతాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. సమీపంలోని పాఠశాలలో 120 మంది విద్యార్థులు చదువుతున్నారని, రాత్రిపూట మైనింగ్ చేపట్టకుండా ఆదేశించాలని కోరారు.
అయితే, ఇప్పటివరకు క్వారీయింగ్ ప్రారంభం కాలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన హామీకి విరుద్ధంగా పనులు ప్రారంభిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
