కడు పేదరికం తగ్గింది.. మార్పు రావల్సింది కనీస అవసరాల్లో..

కడు పేదరికం తగ్గింది.. మార్పు రావల్సింది కనీస అవసరాల్లో..

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆహార భద్రత, మౌలిక సదుపాయాల విస్తరణ, ఉపాధి అవకాశాలు పెరుగుదలతో పేద కుటుంబాలకు కొంత ఆర్థిక భరోసా లభిస్తోంది. ఈ మార్పు కేవలం అనుభవాల్లోనే కాదు, గణాంకాల్లోనూ కనిపిస్తోంది.

ప్రపంచ బ్యాంకు తాజా అంచనాలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి.  రోజుకు 4.20 డాలర్ల పేదరిక ప్రమాణం కంటే తక్కువ కొనుగోలు శక్తితో జీవిస్తున్న భారతీయుల వాటా 2011–12లో 57.7 శాతంగా ఉండగా, 2023–24 నాటికి 16.1 శాతానికి తగ్గింది.

ఈ కాలంలో సుమారు 49.6 కోట్ల మంది  పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. తీవ్ర పేదరికాన్ని సూచించే రోజుకు 3 డాలర్ల ప్రమాణం ప్రకారం కూడా పేదరికం 27.1 శాతం నుంచి 2.6 శాతానికి పడిపోయింది.  దేశంలో  ఇంత పెద్ద మార్పు రావడం గణనీయమైన పరిణామం.

పేదరిక తగ్గుదలలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పాత్రను విస్మరించలేం. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, గ్రామీణ ఉపాధి హామీ, ప్రత్యక్ష నగదు బదిలీలు, గృహ నిర్మాణం, విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వంటగ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్షన్లు, బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవల విస్తరణ వంటి కార్యక్రమాలు పేదల జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో తోడ్పడ్డాయి. ఈ పథకాల ప్రభావాన్ని కొన్ని గణాంకాలు కూడా తెలియజేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రధానమంత్రి గరీబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్న యోజన కింద  దేశవ్యాప్తంగా సుమారు 80.48 కోట్ల మంది ఉచిత ఆహార ధాన్యాలు పొందుతున్నారు. ఈ పథకాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు కేంద్రం సుమారు రూ.11.80 లక్షల కోట్ల ఆహార సబ్సిడీ వ్యయాన్ని అంచనా వేసింది. అలాగే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10.57 కోట్లకు పైగా ఉచిత ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ కనెక్షన్లు అందించగా, సౌభాగ్య పథకం ద్వారా 2.8 కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్షన్లు కల్పించారు.

సంక్షేమ పథకాలు.. పేదలకు ఆర్థిక భరోసా
ముఖ్యంగా ఉచిత రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల కుటుంబాలపై ఆహార ఖర్చు భారం తగ్గుతోంది. ఆదా అయిన మొత్తాన్ని పిల్లల చదువు, వైద్యం, ప్రయాణం వంటి ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం కలుగుతోంది. రోజువారీ కూలీపై ఆధారపడే కుటుంబాన్ని తీసుకుంటే, నెలలో కొన్ని రోజులు పని దొరకకపోయినా ఆహార అవసరాలు మాత్రం ఆగవు. అలాంటి సమయంలో ప్రతి వ్యక్తికి నెలకు ఐదు కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందడం ఆ కుటుంబానికి గణనీయమైన అండగా నిలుస్తుంది. అంటే, ప్రభుత్వం కేవలం ఆహారాన్ని అందించడం మాత్రమే కాదు. 

పరిమితమైన, అస్థిరమైన ఆదాయంతో జీవించే కుటుంబాలపై ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తోంది. సంక్షేమ పథకాల అసలు ప్రాధాన్యత ఇదే.  అయితే, ఈ సహాయం పేదరికాన్ని తగ్గించడంలో తోడ్పడినప్పటికీ, కుటుంబాలకు శాశ్వత ఆర్థిక భద్రత కల్పించాలంటే స్థిరమైన ఉపాధి, మెరుగైన వేతనాలు, ఆదాయ అవకాశాలు కూడా పెరగాలి. ప్రపంచ బ్యాంకు నివేదిక కూడా ఆహార సబ్సిడీలు, సామాజిక బదిలీలు, ఉపాధి పెరుగుదల పేదరికం తగ్గుదలకు దోహదపడిన అంశాలని పేర్కొంటోంది. 

పేదరికం తగ్గినా.. 
పేదరికం తగ్గిందంటే పేద కుటుంబాల ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమైనట్లు కాదు.  ప్రపంచ బ్యాంకు 2026 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంచనాల ప్రకారం 2023–24లోనూ రోజుకు 4.20 డాలర్ల అంతర్జాతీయ పేదరిక ప్రమాణం కంటే తక్కువ వినియోగ స్థాయిలో సుమారు 23.2 కోట్ల మంది ఉన్నారు. అదేవిధంగా రోజుకు 3 డాలర్ల తీవ్ర పేదరిక ప్రమాణం కింద దాదాపు 3.5 కోట్ల మంది కొనసాగుతున్నారు. అంటే పేదరికం గణనీయంగా తగ్గినప్పటికీ, దేశంలో ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆర్థికంగా బలహీనమైన పరిస్థితుల్లోనే ఉన్నారు.

భారతదేశంలో ఉపాధిలో అసంఘటిత రంగం వాటా అధికంగా ఉండటం వల్ల చాలామంది కార్మికులకు స్థిరమైన నెలవారీ ఆదాయం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా వంటి రక్షణలు పరిమితంగానే ఉన్నాయి. ఇలాంటి కుటుంబాలకు ఒక అనారోగ్యం, ఉద్యోగ నష్టం లేదా పంట వైఫల్యం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించవచ్చు.  కుటుంబంలో  సంపాదించే వ్యక్తికి పని పోవచ్చు. రైతు కుటుంబానికి పంట నష్టం జరగవచ్చు.  ఇలాంటి ఒక్క సంఘటన ఆ కుటుంబాన్ని మళ్లీ అప్పుల ఊబిలోకి నెట్టవచ్చు. కాబట్టి పేదరిక రేఖను దాటడం ఒక ముందడుగు మాత్రమే. ఆర్థికంగా నిలదొక్కుకోవడం మరో పెద్ద సవాలు.

గణాంకాల్లో కాదు, జీవితాల్లో మార్పు రావాలి
పేదరికం తగ్గుతోందని చెబుతున్నప్పుడు దేశంలో సుమారు 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఎందుకు అందిస్తున్నారన్న ప్రశ్న రావడం సహజం. దీనిని అర్థం చేసుకోవాలంటే పేదరికాన్ని కొలిచే ప్రమాణానికి, ఆహార భద్రత పథకాల అర్హతకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలి. 

ఈ రెండింటి లెక్కింపు విధానాలు ఒకేలా ఉండవు. పేదరిక రేఖకు పైన ఉన్న కుటుంబం కూడా ఆర్థికంగా బలంగా ఉండకపోవచ్చు. రోజువారీ కూలీపై ఆధారపడే కుటుంబానికి నెలలో అన్ని రోజులు పని దొరకదు. వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం ఆహారం, అద్దె, విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పిల్లల చదువు, వైద్యం వంటి అవసరాలకే ఖర్చవుతుంది.

ధరలు పెరిగినప్పుడు ఆ కుటుంబం చేతిలో మిగిలేది మరింత తగ్గిపోతుంది. ఇలాంటి కుటుంబాలకు ఉచిత రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక ముఖ్యమైన భరోసా. అందువల్ల రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొందుతున్న వారందరూ తీవ్ర పేదరికంలో ఉన్నారని చెప్పడం సరికాదు. అదే సమయంలో పేదరికం తగ్గిందని చెప్పి ఆహార భద్రత పథకాల అవసరం లేదనడమూ సరైంది కాదు. అయితే నిజంగా అవసరమైన వారికే ప్రయోజనాలు అందేలా చూడటం, పథకాల అమలులో పారదర్శకత పాటించడం కూడా అంతే ముఖ్యం. 

కానీ ఒక కుటుంబం ఎప్పటికీ ప్రభుత్వ సహాయంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఆ కుటుంబానికి స్థిరమైన ఆదాయం వచ్చే ఉపాధి లభించాలి. పిల్లలకు మంచి విద్య అందాలి. అనారోగ్యం వచ్చినప్పుడు అప్పులు చేయకుండా వైద్యం పొందగలగాలి. అప్పుడే పేదరికం నుంచి నిజమైన విముక్తి సాధ్యమవుతుంది.

చిట్టెడ్డి కృష్ణారెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీయూ

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.