బతుకుతెరువు కోసం, కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకోవడం కోసం విదేశాలకు వెళ్లాలనుకునే సగటు నిరుద్యోగి ఆశలే పెట్టుబడిగా ఉత్తర తెలంగాణలో ఒక భారీ మాఫియా రాజ్యమేలుతోంది. నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఆదిలాబాద్ తదితర ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నకిలీ విదేశీ ఏజెంట్ల దందా రోజురోజుకూ శృతిమించుతోంది. స్థానికంగా సరైన ఉపాధి అవకాశాలు కరువై, వ్యవసాయం గిట్టుబాటుకాక, అప్పుల బాధ తాళలేక విదేశీ బాటపడుతున్న అమాయక యువతను, నిరుద్యోగులను కొన్ని సంఘటిత ముఠాలు నిలువునా ముంచుతున్నాయి.
ఒకప్పుడు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితమైన ఈ మోసాల వలయం నేడు రష్యా, ఆర్మేనియా, మలేషియా, ఇండోనేసియా వంటి దేశాలకు సైతం విస్తరించడం అత్యంత ఆందోళనకరం. చట్టంలోని లొసుగులను, అధికార యంత్రాంగంలోని అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఈ నయా మానవ అక్రమ రవాణాపై న్యాయపరమైన, పాలనాపరమైన ఉక్కుపాదం మోపాలి.
ఈ ముఠాలు అనుసరిస్తున్న మోసపూరిత విధానం అత్యంత పకడ్బందీగా ఉంటోంది. గ్రామాల్లోని సబ్ -ఏజెంట్ల ద్వారా నిరుద్యోగ యువతకు విదేశాల్లో నెలకు లక్షల్లో జీతాలంటూ ఆశచూపుతారు. అమాయకుల దగ్గర ఒక్కొక్కరి నుంచి రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారు. అంతర్జాతీయ కార్మిక చట్టాలు, మన దేశ నిబంధనల ప్రకారం విదేశాల్లో ఉద్యోగం చేయాలంటే ఎంప్లాయ్మెంట్ వీసా (ఉద్యోగ వీసా) తప్పనిసరి.
కానీ ఈ నకిలీ ఏజెంట్లు తమ ఖర్చు తగ్గించుకోవడానికి, అడ్డదారిలో డబ్బు దండుకోవడానికి యువతను గల్ఫ్ దేశాలతోపాటు రష్యా, ఆర్మేనియా, మలేషియా, ఇండోనేసియా వంటి దేశాలకు కేవలం టూరిస్ట్ వీసా (పర్యాటక వీసా) లేదా విజిట్ వీసాలపై పంపిస్తున్నారు. ఆయా దేశాల్లోకి వెళ్లాక అక్కడి కంపెనీలే ఆ వీసాలను ఉద్యోగ వీసాలుగా మారుస్తాయని పచ్చి అబద్ధాలు చెబుతారు.
టూరిస్ట్ వీసాల వల.. రిటర్న్ టికెట్ల మాయాజాలం
ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో దొరికిపోకుండా ఉండేందుకు ఏజెంట్లు మరో ఘరానా మోసానికి పాల్పడుతున్నారు. ప్రయాణికుడికి వెళ్లే టికెట్‌తోపాటు తిరుగు ప్రయాణానికి (రిటర్న్ టికెట్) బుక్ చేసినట్లు నకిలీ లేదా తాత్కాలిక పీఎన్ఆర్ చూపిస్తారు. బాధితుడు విమానం ఎక్కి విదేశీ గడ్డపై కాలుపెట్టగానే ఇక్కడి ఏజెంట్లు ఆ రిటర్న్ టికెట్‌ను రద్దుచేసి ఆ డబ్బును సైతం కాజేస్తున్నారు.
తీరా విదేశాలకు వెళ్లాక అక్కడ హామీ ఇచ్చిన ఉద్యోగాలు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక, తిరిగి రావడానికి టికెట్ లేక, టూరిస్ట్ వీసా గడువు ముగిసి అక్కడి పోలీసులకు అక్రమ వలసదారులుగా దొరికిపోయి జైళ్లలో మగ్గుతున్న తెలుగు యువత వ్యథలు వర్ణనాతీతం. రష్యా, ఆర్మేనియా వంటి దేశాల్లో భాష తెలియక, ప్రమాదకరమైన పనుల్లో ఇరుక్కుపోతున్న ఘటనలు మానవ హక్కుల ఉల్లంఘనకు పరాకాష్టగా నిలుస్తున్నాయి.
ఏజెంట్లను నిలదీస్తే ఉల్టా కేసులు
విదేశాల్లో నరకయాతన అనుభవించి, బంధువుల సాయంతో అప్పులు చేసి తిరిగి స్వదేశానికి చేరుకున్న బాధితులకు ఇక్కడ మరో రకమైన నరకం ఎదురవుతోంది. తమను మోసం చేసిన ఏజెంట్లను నిలదీసి, తాము కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే ఆ ముఠాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయల అండతో, కొందరు బాధితులపైనే ఉల్టా కేసులు (కౌంటర్ కేసులు) బనాయిస్తున్నారు. దాడి చేశారని, లేదా దౌర్జన్యం చేస్తున్నారని తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
చట్టాలు ఏం చెబుతున్నాయి ?
భారతదేశంలో విదేశీ వలసలను నియంత్రించడానికి, కార్మికుల ప్రయోజనాలను రక్షించడానికి ఎమిగ్రేషన్ చట్టం-1983 స్పష్టమైన నిబంధనలను ఏర్పరిచింది. ఈ చట్టంలోని సెక్షన్ 10, సెక్షన్ 24 ప్రకారం విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ జారీచేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (లైసెన్స్) లేకుండా ఏ వ్యక్తీ, ఏ సంస్థా విదేశీ ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేపట్టకూడదు. లైసెన్స్ లేకుండా వీసాల దందా చేయడం సెక్షన్ 24 ప్రకారం నాన్-బెయిలబుల్, కాగ్నిజబుల్ నేరం. దీనికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇక నూతన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) నిబంధనల ప్రకారం చూస్తే అమాయకులను నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేయడం సెక్షన్ 318 (పాత ఐపీసీ 420 - చీటింగ్) కింద, నకిలీ వీసాలు లేదా నకిలీ విమాన టికెట్లు సృష్టించడం సెక్షన్ 336 (ఫోర్జరీ) కింద నేరమవుతుంది. ముఖ్యంగా ఉపాధి పేరుతో మభ్యపెట్టి విదేశాల్లో వెట్టిచాకిరీకి లేదా అక్రమ పనులకు గురిచేయడం బీఎన్ఎస్ సెక్షన్ 143 (పాత ఐపీసీ 370 - మానవ అక్రమ రవాణా) కిందకు వస్తుంది. మానవ అక్రమ రవాణా కింద కేసు నమోదైతే ఏడేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.
పోలీసుల పాత్ర, ప్రభుత్వ తక్షణ కర్తవ్యం
ఈ మాఫియా ఆగడాలను అరికట్టడంలో పోలీసుశాఖ చిత్తశుద్ధితో వ్యవహరించాలి. జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లపై ప్రత్యేక నిఘా పెట్టాలి. నకిలీ ఏజెంట్లతో కుమ్మక్కై బాధితులపై ఉల్టా కేసులు పెట్టే స్టేషన్ హౌస్ ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలతోపాటు, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఎన్ఆర్ఐ సెల్‌లను క్రియాశీలం చేయాలి. వీసా మోసాలను సాధారణ సివిల్ వివాదాలుగా కాకుండా వ్యవస్థీకృత నేరాలుగా పరిగణించి బీఎన్ఎస్ సెక్షన్ 111 (ఆర్గనైజ్డ్ క్రైమ్), మానవ అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి. పట్టణాల్లోని ప్రధాన కన్సల్టెన్సీలతో పాటు గ్రామాల్లో కమీషన్ల కోసం అమాయకులను వలలో వేస్తున్న సబ్- ఏజెంట్లపై పీడీ యాక్ట్ ప్రయోగించాలి.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం తెలంగాణవ్యాప్తంగా అనుమతి లేకుండా నడుస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు, వీసా కన్సల్టెన్సీలపై రెవెన్యూ, పోలీస్, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అధికారులతో కూడిన జాయింట్ టాస్క్‌ఫోర్స్ ద్వారా ఆకస్మిక దాడులు నిర్వహించి సీజ్ చేయాలి. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) సేవలను తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి. బాధితులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించి, ఏజెంట్ల ఆస్తులను జప్తు చేసి బాధితులకు నష్టపరిహారం ఇప్పించేలా కఠిన చర్యలు తీసుకోవాలి.
యువత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
విదేశాలకు వెళ్లాలనుకునే యువత కనీస జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. తమకు వీసా ఇప్పిస్తున్న ఏజెంట్ లేదా కన్సల్టెన్సీకి కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉందో లేదో (emigrate.gov.in) వెబ్సైట్లో తనిఖీ చేయాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ నంబర్ లేని ఏజెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నప్పుడు కచ్చితంగా ఎంప్లాయ్మెంట్ వీసా మాత్రమే తీసుకోవాలి. టూరిస్ట్ వీసా, విజిట్ వీసాపై వెళ్లి అక్కడ ఉద్యోగం చేయడం ఆయా దేశాల చట్టాల ప్రకారం నేరం అని గుర్తించాలి.
ఏజెంట్లకు చెల్లించే ప్రతి రూపాయిని ఆన్లైన్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారానే చెల్లించాలి, దానికి సంబంధించిన రసీదు తీసుకోవాలి. నగదు రూపంలో ఇస్తే భవిష్యత్తులో కోర్టులో నిరూపించడం కష్టమవుతుంది. విమాన టికెట్, వీసా అసలువా కాదా అనేది ఆయా ఎయిర్‌లైన్స్, ఎంబసీ వెబ్సైట్లలో స్వయంగా తనిఖీ చేసుకోవాలి. ఏజెంట్ల ఆగడాలను అరికట్టడంలో పోలీసుల నిష్పక్షపాత వైఖరి, ప్రభుత్వ కఠిన చర్యలు, ప్రజల అప్రమత్తత... ఈ మూడూ కలిస్తేనే విదేశీ ఏజెంట్ల మోసాలకు తెరపడుతుంది.
డా. కట్కూరి పాలసీ విశ్లేషకుడు
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ [email protected]
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
