వికారాబాద్, వెలుగు : గొర్రెలు మేపడానికి వెళ్లిన ఇద్దరు గొర్రెల కాపరులు మైనింగ్ క్వారీ గుంతలో పడి మృతి చెందిన విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా, ధారూర్ మండలంలోని తరిగోపుల గ్రామంలో చోటుచేసుకుంది. ధారూర్ సీఐ రఘురాం తెలిపిన వివరాల ప్రకారం.. ధారూర్ మండలంలోని తరిగోపుల గ్రామానికి చెందిన అశోక్ (19), శ్రీనివాస్ (40)లు మంగళవారం ఎప్పటిలాగే తమ గొర్రెలను మేపడానికి వెళ్లారు.
గ్రామ శివారులో ఉన్న మైనింగ్ క్వారీ గుంతలో తమ గొర్రెలను కడుగడానికి అశోక్ దిగాడు. అశోక్ ఈత రాకపోవడంతో క్వారీ గుంతలో మునిగి పోతుండడంతో కాపాడడానికి వెళ్లిన శ్రీనివాస్ ను అశోక్ గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు నీటి మునిగి ఊపిరి ఆడక క్వారీ గుంతలో మునిగి మృతి చెందారు. మృతుడు శ్రీనివాస్ భార్య దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రఘురాం
తెలిపారు.
