ముషీరాబాద్, వెలుగు: ‘ఇళ్ల స్థలాల కోసం 18 ఏండ్లుగా ఎదురు చూస్తున్నం.. ఇకనైనా ఇవ్వండి’ అంటూ జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మంగళవారం ధర్నా చేశారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కు చెందిన పలువురు నాయకులు, ఇతర జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ పాత్రికేయులు వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య, రమణారావు, ఎంవీఆర్ శాస్త్రి, గోపరాజు, అశోక్ రెడ్డి, శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదన్నారు.
18 ఏండ్ల క్రితం జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్, నిజాంపేట్ లలో కేటాయించిన స్థలాలను ఆ సొసైటీ సభ్యులకు ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అన్యాయమన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ స్థలాలు కేటాయించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం పేట్ బషీరాబాద్, నిజాంపేట స్థలాలనే ఇవ్వాలని సభ్యులు తీర్మానం చేశారు. సీనియర్ జర్నలిస్టులు మహేందర్ రెడ్డి, సొసైటీ నాయకులు బి.శ్రీనివాస్, కుంచం శ్రీనివాస్, వి.రవికుమార్, రవికుమార్, బ్రహ్మం పాల్గొన్నారు.
