సింగరేణి డిస్మిస్ కార్మికుల కేసుల పునఃపరిశీలన..ఈనెల 14 వరకు దరఖాస్తుల స్వీకరణ

సింగరేణి డిస్మిస్ కార్మికుల కేసుల పునఃపరిశీలన..ఈనెల 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థలో తొలగించిన డిస్మిస్ కార్మికులను మళ్లీ విధుల్లోకి చేర్చుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగాలు కోల్పోయినవారి కేసులను పునఃసమీక్షించాలని నిర్ణయించింది. హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1, 2023 నుంచి డిసెంబర్ 31, 2025 మధ్య కాలంలో డిస్మిస్ అయిన కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ 01, 2026 నాటికి 46 ఏండ్ల లోపు వయసు ఉండాలని సూచించింది. ఇటీవల ప్రజాభవన్​లో కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణిలో డిస్మిస్ ఉద్యోగులకు తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు. ఈ అంశాన్ని పరిశీలించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ మేరకు సింగరేణి బోర్డు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నది.
అర్హతలు ఇవీ..
ఉద్యోగులను తొలగించిన కాలానికి ముందున్న గత 5 ఏండ్లలో ఏదైనా 2 సంవత్సరాల్లో కనీసం 100 మస్టర్లు పూర్తి చేసి ఉండాలి. జనరల్ అసిస్టెంట్ ట్రైనీ (యూజీ), కేటగిరీ-I పోస్టులో పునఃనియామకం కోసం వైద్యపరంగా ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలి. అర్హత కలిగి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే డిస్మిస్ ఉద్యోగులు తగిన ప్రొఫార్మాలో దరఖాస్తు పూర్తిw చేసి డిపార్ట్‌‌‌‌‌‌‌‌ మెంట్ అధిపతికి సమర్పించాలి. దరఖాస్తు సమర్పించడానికి ఈనెల 14 చివరి తేదీగా సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఏరియా జనరల్ మేనేజర్లు అర్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి, తదుపరి చర్యల నిమిత్తం నిర్ణీత తేదీలోగా సంబంధిత అధికారులకు పంపించాలని ఆదేశించింది. దరఖాస్తులను ముందుగా ఏరియా లెవల్ కమిటీ సభ్యులు స్క్రూట్నీ చేసి ఈనెల 20 లోపు జాబితా తయారు చేసి జీఎంలకు పంపించాలి.