హైదరాబాద్, వెలుగు: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వేధిస్తున్న ప్రొఫెసర్లు, స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం యూ కోట్.. వీ పే విధానానికి ఆమోదం తెలిపింది. ఏజెన్సీ ఏరియాలకు వెళ్లేందుకు సీనియర్ ఫ్యాకల్టీ విముఖత చూపుతుండటంతో, డాక్టర్లే తమకు కావాల్సిన నెలవారీ వేతనాన్ని కోట్ చేసుకునే అవకాశాన్ని ఈ విధానం కల్పిస్తుంది.
తక్కువ మొత్తం కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు కేటాయిస్తారు. ఈ పద్ధతిలో ఎంపికయ్యే ఫ్యాకల్టీకి ప్రభుత్వం తన ఖజానా నుంచి రెగ్యులర్ బేసిక్ కాంట్రాక్ట్ శాలరీని చెల్లిస్తుంది. డాక్టర్లు కోరిన వేతనంలో మిగిలిన వ్యత్యాస మొత్తాన్ని నేషనల్ హెల్త్ మిషన్ నిధుల నుంచి టాప్- అప్ ఇన్సెంటివ్ రూపంలో సర్దుబాటు చేస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ప్రత్యేకంగా రూ. 7.14 కోట్ల నిధులకు అధికారిక ఆమోదం తెలిపింది.
