- నలుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
నార్కట్‌పల్లి, వెలుగు: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని గోపలాయపల్లి శివారులో ఐడియల్ డిటోనేటర్ కంపెనీలో మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి భవనం పైకప్పు కూలిపోగా, గోడలు ధ్వంసమయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని ఐడియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన షాక్ట్యూబ్ తయారీ ప్లాంట్ లో అల్యూమినియం పౌడర్ మిశ్రమం చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్లాంట్ భవనం పూర్తిగా దెబ్బతిన్నది. పేలుడు సమయంలో అక్కడ పని చేస్తున్న కార్మికులు పబ్బు శివకుమార్, ప్రతాప్ దేహూరి,ఈశ్వర్ ప్రధాన్, ఉత్తమ్‌కుమార్ గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని నల్గొండ డీఎస్పీ శివరామిరెడ్డి, ఆర్డీవో అశోక్ రెడ్డి, సీఐ సురేశ్ పరిశీలించారు. గోపలాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నిరంజన్ ఫిర్యాదు మేరకు ఎస్సై సీహెచ్వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేపట్టారు.
