- సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్
చండూరు, వెలుగు: కరువు పరిస్థితులతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు.
కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన కరువు యాత్రలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను వారు పరిశీలించారు.
రైతులు సుంకరి లింగయ్య, శాంభవి, సుంకరి రాములు పంట పొలాలను సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చండూరు మండలంలో 28 వేల ఎకరాలకు పైగా పత్తి, 2,500 ఎకరాల్లో వరి సాగు చేయగా, బంగారుగడ్డలో 2,098 ఎకరాల్లో పత్తి, 168 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు తెలిపారు.
ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన కరువు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, పెట్టుబడులు పెట్టినా పంటలు చేతికందడం లేదన్నారు. ప్రభుత్వం సమగ్రంగా పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులందరికీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వారివెంట పార్టీ నాయకులు రామలింగయ్య, వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, వెంకన్న తదితరులున్నారు.
