- ఫామ్-1 అనుమతులిస్తున్న సిబ్బంది
- లక్షల్లోవసూళ్లు చేస్తూ జేబులు నింపుకుంటున్నరు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మల్కాజిగిరి మున్సిపల్కార్పొరేషన్లో వ్యాపార సముదాయాలకు అడ్వర్టైజ్ మెంట్ గ్లో సైన్ బోర్డులు, నేమ్ బోర్డులు లేదా ఫ్లెక్స్ బోర్డుల అనుమతుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ప్రకటన బోర్డుల అనుమతుల కోసం ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా మాన్యువల్ ఫామ్-1 ద్వారా దరఖాస్తుల స్వీకరణ, పేమెంట్ చెల్లింపులు జరుగుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా చేతిరాత దరఖాస్తులతో అనుమతుల ప్రక్రియ సాగించడం వెనుక అడ్వర్టైజ్‌మెంట్ విభాగం అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకటనల అనుమతుల పేరుతో వ్యాపారస్థుల ను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది ఇలాగే ఉంటుంది అంతే..
ఉప్పల్ సర్కిల్ లోని ఓ హోమ్ నీడెడ్ షాప్ కి 122 స్కైర్ మీటర్లలో నేమ్ బోర్డు ఏర్పాటు చేసుకోగా, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4,75,817 చెల్లించాలని అక్టోబర్ 26న ఫామ్–1 డిమాండ్ ని అడ్వర్టైజ్ మెంట్ విభాగ సిబ్బంది జారీ చేశారు. ఆన్ లైన్ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత మాన్యువల్‌గా ఎందుకిచ్చారని షాపు ఓనర్ ప్రశ్నించగా..‘ఇది ఇలాగే ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు.
అంతేకాకుండా రూ. 4 లక్షలు కాకుండా తమకే ఎంతో కొంత ఇస్తే ఈ ఏడాదికి వదిలేస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈ కార్పొరేషన్పరిధిలో చాలాచోట్ల ఇదే విధంగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. దీంతో ఎంఎంసీ ఖజానాకు రావాల్సిన ఆదాయం సిబ్బంది జేబుల్లోకి పోతోంది.
అవకాశమే లేదంటున్న ఆఫీసర్లు
అడ్వర్టైజ్ మెంట్ విభాగానికి సంబంధించి అన్ని అనుమతుల జారీని పాత జీహెచ్ఎంసీ ఉన్నప్పుడే ఆన్ లైన్ లోకి మార్చారు. అయితే, ఆన్‌లైన్ విధానం ఉండగా, చేతిరాత ఫారాలతో ప్రకటనల అనుమతులు, ఫీజుల చెల్లింపులు ఎలా సాధ్యమవుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విధానానికి ఉన్నతాధికారుల అనుమతి ఉందా? మాన్యువల్ దరఖాస్తులకు ప్రత్యేకంగా ఏమైనా మినహాయింపులున్నాయా? అంటే అవకాశం లేదని ఉన్నతాధికారులు చెప్తున్నారు.
విచారణ జరిపితే అక్రమాలు బయటకు..
మాన్యువల్ ప్రకటనల అనుమతుల జారీ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మాన్యువల్ ఫామ్–-1లను ఎన్ని స్వీకరించారు? వాటి ఆధారంగా ఎన్ని అనుమతులు ఇచ్చారు? ఎంతమేర ఆదాయం సమకూరింది? ఆన్‌లైన్ విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? అనే అంశాలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న ప్రజలు డిమాండ్చేస్తున్నారు.
