కరీంనగర్/గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లేబర్ కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న పైలాన్ కూల్చివేతలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతుండగా అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసభ్య పదజాలంతో తిడుతూ జేసీబీ డ్రైవర్ పై దాడి చేశాడు.
అడ్డుకోబోయిన సీఐ ఇంద్రాసేనారెడ్డితోనూ వాగ్వాదానికి దిగారు. అనంతరం కూల్చివేతలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ పైలాన్ కూల్చివేతకు బాధ్యులైన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు, కౌశిక్ హరి, వాళ హరీశ్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి గోదావరిఖని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కాగా, రామగుండం మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన పైలాన్ అడ్డుగా ఉండడం వల్ల కోర్టు చౌరస్తాలో ఇప్పటి వరకు 12 వరకు యాక్సిడెంట్ల జరిగి, నలుగురు చనిపోయారని, అందుకే పైలాన్‌ను తొలగిస్తున్నామని తెలిపారు. పైలాన్ తీసి అంబేద్కర్ పార్కులో పెడదామని మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసి తీయిస్తుంటే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జేసీబీ డ్రైవర్ ను కొట్టడం దారుణమని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని
కోరారు.
