- 36 రాష్ట్రాలు, యూటీల్లో 6.52 లక్షల మంది బాధితులు
- 12 మందిని అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు
అమ్రేలి (గుజరాత్): డిజిటల్ వాలెట్ యాప్‌లో పెట్టుబడులు పెడితే లక్షల్లో ఆదాయం వస్తుందని నమ్మించి నట్టేట ముంచేశారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 6.52 లక్షల మంది నుంచి రూ.1,211 కోట్లు వసూలు చేశారు. గుజరాత్‌లో వెలుగుచూసిన ఎస్‌డీ పే ఆర్థిక మోసం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తాము పెట్టిన డబ్బుపై లాభాలు వస్తాయని భావించి బంధువులు, స్నేహితులు, సహోద్యోగులనూ యాప్‌లో చేర్పించి, ఈ నెట్‌వర్క్ చివరకు లక్షలాది మందిని ముంచేసింది. ఎస్‌డీ పేను డిజిటల్ వాలెట్‌గా పరిచయం చేసినప్పటికీ.. దాని వెనుక మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యవస్థ నడిచినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
యాప్‌లో డబ్బులు పెట్టి, కొత్తవారిని చేర్పిస్తే అదనపు ప్రయోజనాలు వస్తాయని నమ్మించారు. వాలెట్‌లో ఉన్న మొత్తం నగదుపై నెలకు 9 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తామని ప్రచారం చేశారు. 15 అంచెల రెఫరల్ వ్యవస్థ ద్వారా సభ్యులు తమ కింద మరింత మందిని చేర్చుకునేలా ప్రోత్సహించారు. గుజరాత్‌కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు 2025లో తనకున్న ఒక ఫ్లాట్‌ను అమ్మి, ఆ వచ్చిన రూ.9.5 లక్షలను ఎస్‌డీ పేలో పెట్టుబడి పెట్టి మోసపోయింది. ఆమె తన కుటుంబ సభ్యులు, మరో 20 మంది పరిచయస్తులను అందులో చేర్పించగా, అందరూ మోసపోయారు.
కొత్త పెట్టుబడులు తగ్గడంతో బండారం బయటకు..
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. 2026 మార్చి నుంచి కొత్తగా పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. దీంతో అప్పటికే పెట్టుబడులు పెట్టినవారికి రాబడులు చెల్లించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో నగదు విత్‌డ్రాను నిలిపివేసి, పెట్టుబడిదారులకు కంపెనీ షేర్లు ఇస్తామని నిందితులు చెప్పినట్లు తెలిసింది. రెండు నెలల విచారణలో పోలీసులు సుమారు 900 మంది సాక్షులను విచారించారు. తొలుత గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రకే ఈ వ్యవహారం పరిమితమైందని భావించినప్పటికీ.. కర్నాటక, బిహార్, ఉత్తరప్రదేశ్‌లకూ నెట్‌వర్క్ విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితులుగా భావిస్తున్న ధవల్ పటేల్, నరేంద్ర సోలంకి.. మహారాష్ట్రలో ‘అప్నా పే’ పేరుతో కార్యకలాపాలు కొనసాగించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహార బాధ్యతలను నరేంద్ర కాంగ్రేకు అప్పగించినట్లు సమాచారం. అతడిపైనా కేసు నమోదవగా, ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ధవల్ పటేల్, సంతోష్ పాఠక్, నరేంద్ర సోలంకి సహా 12 మందిని అరెస్టు చేశారు.
