SIR ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలి..అర్హులైన ఓటర్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారు: ప్రొఫెసర్‌‌‌‌ హరగోపాల్‌‌‌‌

SIR ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలి..అర్హులైన ఓటర్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారు:  ప్రొఫెసర్‌‌‌‌ హరగోపాల్‌‌‌‌

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌) ప్రక్రియలో అనేక లోపాలున్నాయని, అర్హులైన ఓటర్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నందున తక్షణమే రద్దు చేయాలని ప్రముఖ విద్యావేత్త, పౌరహక్కుల నాయకుడు ప్రొఫెసర్‌‌‌‌ హరగోపాల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. సర్వే అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.

 బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో తెలంగాణ ఓటర్స్‌‌‌‌ రైట్స్‌‌‌‌ పోరు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజా విచారణ వివరాలను వెల్లడించారు. పగటిపూట ఇళ్లలో లేని ఉద్యోగులను తిరిగి సంప్రదించకుండా 'ఆచూకీ లేనివారు'గా నమోదు చేస్తున్నారని, బతికున్నవారిని సైతం చనిపోయినట్లు చూపిస్తున్నారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు.

 ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్‌‌‌‌ మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌‌‌‌ నియోజకవర్గంలోని తిరుమలగిరి 150, 151 పోలింగ్‌‌‌‌ బూత్‌‌‌‌ల పరిధిలో 1,800 ఓట్లకు గాను 720 తొలగించారని, 900 మందికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. 

ప్రస్తుతం రెండు బూత్‌‌‌‌లలో కలిపి 230 మంది ఓటర్లు మాత్రమే మిగిలారని పేర్కొన్నారు. తిరుమలగిరికి చెందిన కె.గణేశ్‌‌‌‌ మాట్లాడుతూ.. సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌ బృందం ఫోన్‌‌‌‌ చేసే వరకు తన ఓటు తొలగించిన విషయం తెలియలేదన్నారు. గతంలో పలుమార్లు ఓటు వేసిన తనను కొత్త ఓటరుగా ఫారం-6 సమర్పించాలని బీఎల్‌‌‌‌ఓ కోరడం ఏమిటని ప్రశ్నించారు.

 ముషీరాబాద్‌‌‌‌కు చెందిన అమీనా బేగం మాట్లాడుతూ.. తన కుమారుడు అమీర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ ఫారం సమర్పించినా ఓటు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.  విస్సా కిరణ్‌‌‌‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సామాజిక కార్యకర్త ప్రొఫెసర్‌‌‌‌ పద్మజ షా, విద్యావేత్త, సామాజిక కార్యకర్త కుమారి మరియా తబస్సుమ్‌‌‌‌, నేషనల్‌‌‌‌ దళిత్‌‌‌‌ క్రిస్టియన్‌‌‌‌ వాచ్‌‌‌‌కు చెందిన సిస్టర్‌‌‌‌ మంజుల, మానవ హక్కుల న్యాయవాది అడ్వకేట్‌‌‌‌ ఎస్‌‌‌‌.క్యూ. మసూద్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.