- యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యం
- కాకాస్ నెక్ట్స్‌జెన్ లీడర్స్ విజేతలకు రూ.2.25 లక్షల ప్రైజ్ మనీ అందజేత
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి భవిష్యత్తు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాకాస్ నెక్ట్స్‌జెన్ లీడర్స్-కాకా గ్రోత్ ఫండ్’ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎంబీఏ, బీబీఏ, బీకాం విద్యార్థులు వినూత్న వ్యాపార ఆలోచనలు, స్టార్టప్ ప్రాజెక్టులు, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రజెంటేషన్లను ఇచ్చారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించిన ఎంపీ వంశీ..వాటిని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా ప్రాక్టికల్ డెమోలు, ప్రొటోటైప్స్ రూపంలో అభివృద్ధి చేసి అమలు చేయాలని సూచించారు.
విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్టుల్లో ప్రతిభ, ఆవిష్కరణాత్మక ఆలోచనలు, వ్యాపార అవకాశాలను పరిగణనలోకి తీసుకున్న వంశీకృష్ణ .. ఫస్ట్ప్రైజ్ తన్మయ్ బృందానికి ప్రకటించి రూ.లక్ష నగదు బహుమతి అందజేశారు. ద్వితీయ బహుమతి కింద తరుణ్ బృందానికి రూ.75వేలు, థర్డ్ప్రైజ్ కింద దుర్గేష్ టీమ్‌కి రూ.50 వేలు ప్రకటించి అందజేశారు.
ప్రతి విద్యార్థిలో ప్రత్యేక ప్రతిభ ఉంటది..
ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేకమైన ప్రతిభ, వినూత్నమైన వ్యాపార ఆలోచన ఉంటుందని, వాటిని గుర్తించి సరైన అవకాశాలు, ఆర్థిక సహకారం అందిస్తే గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగగలరని ఎంపీ పేర్కొన్నారు. స్టూడెంట్లు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వ్యాపారాలు స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లోని వ్యాపార ఆలోచనలు కాలేజీలకే పరిమితం కాకుండా ప్రపంచానికి పరిచయం కావాలన్నదే ఈ కార్యక్రమం వెనుక ప్రధాన ఉద్దేశమన్నారు.
విద్యార్థుల్లో నుంచే రేపటి ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ లీడర్స్ పుట్టుకురావాలని, వారి ఆలోచనలకు అవసరమైన ఆర్థిక ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందించేందుకు కాకా గ్రోత్ ఫండ్ వేదికగా నిలుస్తుందన్నారు. ప్రతిభావంతమైన ప్రాజెక్టులకు రూ.5 లక్షల వరకు సీడ్ గ్రాంట్, మెంటార్షిప్, పరిశ్రమలతో అనుసంధానం కల్పించే అవకాశాలు కూడా ‘కాకాస్ నెక్ట్స్ జెన్ లీడర్స్’ లో భాగమన్నారు. ఇన్స్టిట్యూషన్స్ సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్పాల్గొన్నారు.
