- ..విదేశాల వల్లే మోదీకి పదవి దక్కిందన్న రాహుల్ కామెంట్లకు బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఫారెన్ కంట్రీల సాయంతోనే అధికారంలోకి వచ్చారని, ఇప్పటికీ అదే సాయంతో పదవిలో కొనసాగుతున్నారని ఇటీవల లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం రాహులే స్వయంగా విదేశీ సాయాన్ని కోరారని విమర్శించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలని రాహులే అమెరికా, ఐరోపాలను గతంలో అభ్యర్థించారని మండిపడింది. మంగళవారం బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తూ, ఆయన విదేశీ పర్యటనలు, పాత వ్యాఖ్యలను గుర్తుచేశారు.
"భారత్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతున్నా అమెరికా, ఐరోపా దేశాలు ఎందుకు స్పందించడం లేదని రాహుల్ గతంలో ప్రశ్నించారు. దేశ అంతర్గత రాజకీయాల్లో విదేశీ జోక్యం కోరుతూ రాహుల్ మాట్లాడటం ఆయన కపట నాటకానికి నిదర్శనం.బిలియనీర్ జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నిధులతో నడిచే సంస్థలతో కాంగ్రెస్ అగ్రనేతలకు సంబంధాలున్నాయి. రాహుల్ తరచూ విదేశాలకు వెళ్లడం, రహస్య సమావేశాలు నిర్వహించడంపై జాతీయ భద్రతా పరమైన సందేహాలున్నాయి" అని ఆరోపించారు.
