- పలు మండలాల్లో దెబ్బతిన్న పంటలు
- పంట చేతికి వచ్చిన సమయంలో రాలుతున్న వడ్లు
ఖమ్మం, వెలుగు: మొన్న అర్నబ్, ఇప్పుడు మురసు తుఫాన్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. సోమవారం రాత్రి ఈదురుగాలులు, మంగళవారం రోజంతా ముసురుపట్టి వర్షం పడడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేతికందిన సమయంలో పంటలకు నష్టం వాటిల్లుతోంది.
మొన్నటి వరకు ఎల్ నినో ప్రభావంతో కాస్త వడబారిన పొలాలు, పత్తి చేలు కాస్తా, ఇప్పుడు ముసురు, గాలులతో నేలవాలుతున్నాయి. వడ్లకు మంచి రేటు ఉంది అని, ఒకట్రెండు రోజుల్లో పంట కోయడమే మిగిలింది అనుకున్న దశలో ఈ వాన, గాలుల కారణంగా పొలాల్లోనే వడ్లు రాలుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండడంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. కాగా, అశ్వారావుపేటలో 65 మిల్లీమీటర్లు, దమ్మపేటలో 59, అన్నపురెడ్డిలో 36.5, వేంసూరులో 52.3, సత్తుపల్లిలో 43, కల్లూరులో 32.2, పెనుబల్లిలో 30.3, మధిరలో 29.8, బోనకల్ లో 26.5, ఎర్రుపాలెంలో 25.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కొత్తగూడెం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణ సహాయం అందించేందుకు భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర సమాచారం, వర్షాలు, వరదల కారణంగా ఎదురయ్యే సమస్యలను కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 08744 241950, 9392919743 ద్వారా అధికారులకు తెలియజేయవచ్చు. కంట్రోల్ రూమ్ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటూ ఫిర్యాదులను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, సంబంధిత శాఖలకు వెంటనే తెలియజేసి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
