- తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో తగ్గిన విద్యుత్ డిమాండ్
- మొన్నటిదాకా రోజుకు 20 వేల మెగావాట్లు
- ప్రస్తుతం 15 వేల మెగావాట్ల లోపే నమోదు
- వరికోతలతో తగ్గిన కరెంట్ వాడకం
హైదరాబాద్, వెలుగు: తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా తగ్గింది. మొన్న అర్నాబ్, ప్రస్తుతం మురసు తుఫాన్ల కారణంగా అక్కడక్కడ ముసురువానలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అక్టోబర్ చివరి వారం వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత, వ్యవసాయ అవసరాల వల్ల రోజువారీ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 20 వేల మెగావాట్లకు చేరుకుంది.
వాతావరణంలో మార్పులతో గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగం 5వేల మెగావాట్ల మేర తగ్గింది. ఫలితంగా ప్రస్తుతం రోజువారీ విద్యుత్ డిమాండ్ 15 వేలమెగావాట్ల లోపే నమోదవుతోంది. ఇటు విద్యుత్ డిమాండ్ తగ్గడం, బయట మార్కెట్లో కొనే విద్యుత్ రేట్లు పడిపోవడంతో రోజుకు రూ.100 కోట్ల చొప్పున గడిచిన ఐదు రోజుల్లోనే డిస్కమ్‌లకు ఏకంగా రూ. 500 కోట్లకు పైగా ఆదా అయ్యాయని విద్యుత్‌శాఖ ఆఫీసర్లు చెప్తున్నారు.
వర్షాలకు తోడైన చలి..
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి అక్టోబర్ లో ఏప్రిల్ తరహాలో ఎండలు మండిపోయాయి. నెల చివర్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస తుపానుల వల్ల రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలికాలం కూడా తోడవడంతో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
అక్కడక్కడ వర్షాలు కురవడంతో పొలాలకు నీటి తడులు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్రంలో వరికోతలు నడుస్తుండటంతో వ్యవసాయ విద్యుత్వినియోగం క్రమంగా పడిపోతున్నది. ఎండల తీవ్రత, ఉక్కపోతలు తగ్గడంతో ఇండ్లు, ఆఫీసుల్లో ఏసీలు, కూలర్ల వినియోగం దాదాపుగా తగ్గిపోయింది.
బయట మార్కెట్ లోనూ తగ్గిన రేట్లు..
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పడిపోవడంతో ప్రభుత్వం బయట నుంచి కొనుగోలు చేసే విద్యుత్ కూడా తగ్గిపోయింది. అక్టోబర్ 16న రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పీక్ విద్యుత్ డిమాండ్ 20,018 మెగావాట్లు నమోదైంది. ఆ రోజు మొత్తం 337.80 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉపయోగిస్తే ఇందులో జెన్కో 110.14, సింగరేణి 26.35 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయగా, బయటి మార్కెట్లో 145.63 మిలియన్ యూనిట్లను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వచ్చింది.
అప్పుడున్న పరిస్థితుల్లో యూనిట్‌కు రూ.10 చొప్పున చెల్లించాల్సి వచ్చింది. తాజాగా సోమవారం 14,696 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యింది. మొత్తం 270.41 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే ఇందులో జెన్కో 108.30, సింగరేణి 24.62 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయగా, ప్రభుత్వం కేవలం 83.69 మిలియన్ యూనిట్లను మాత్రమే బయట నుంచి కొనుగోలు చేసింది.
సాయంకాలం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండే పీక్ డిమాండ్‌లో సైతం యూనిట్‌కు రూ.7 లోపే విద్యుత్ లభిస్తున్నది. దీంతో రోజుకు రూ.100 కోట్లకు పైగా నిధులు మిగులుతున్నట్లు విద్యుత్‌అధికారులు వెల్లడించారు. మొత్తం మీద వరుస తుపాన్లు తమకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయని
పేర్కొంటున్నారు.
