- ఈ నెల 15 నుంచి మాజీలు కానున్న గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్
- మూడు సీట్లూ కాంగ్రెస్ ఖాతాలోకే..
- బీసీ, ఎస్సీ, ఇతర వర్గాల్లో ఆశావహులు
హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్లో పోటీ పెరుగుతున్నది. ప్రస్తుత ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పదవీకాలం ఈ నెల 15తో ముగియనున్నది. ఈ మూడు స్థానాలు కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉండడంతో పార్టీలోని పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని ఎంపిక చేయడంతో.. గవర్నర్ కోటాలోని మూడు స్థానాల్లో రెండు బీసీలకు కేటాయిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఒకటి పద్మశాలీలకు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో వెల్లడించారు. దీంతో తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కూతురు పవిత్రవాణి పేరు ప్రధానంగా వినిపిస్తున్నది.
మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. రెండో బీసీ సీటు కోసం యాదవ, గౌడ సామాజిక వర్గాల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. యాదవ వర్గం నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్, లోకేశ్ యాదవ్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరు సతీశ్ పేర్లు వినిపిస్తున్నాయి. గౌడ వర్గం నుంచి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ప్రయత్నిస్తున్నారు. ముదిరాజ్ వర్గానికి చెందిన మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతా రావు కూడా మహిళా కోటాలో అవకాశం ఆశిస్తున్నారు. ఇక ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, చాడగొండ వెంకటేశ్, ఎస్టీ కోటాలో సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు బెల్లయ్య నాయక్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బ్రాహ్మణ కోటాలో ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, మైనార్టీ కోటాలో మరో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆశిస్తున్నారు.
ఎప్పుడు భర్తీ చేసినా ఓకే..
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేయాలనే నిబంధన లేదు. ఈ నియామకాలు ఎన్నికల సంఘం పరిధిలోకి రావు. కేబినెట్లో ముగ్గురి పేర్లను ఖరారు చేసి, ఆమోదం కోసం గవర్నర్కు పంపాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అదే సమయంలో గవర్నర్ కోటా స్థానాలను భర్తీ చేస్తే బీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాల మద్దతు కూడగట్టవచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.
