- క్యాన్సర్ వైద్య సేవల వికేంద్రీకరణపై ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలను విస్తృతం చేసేందుకు త్వరలోనే రీజనల్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో క్యాన్సర్ కేర్ సేవలపై సెక్రటేరియెట్ లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్యాన్సర్ చికిత్సను కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి, స్థానికంగానే కీమోథెరపీ అందిస్తున్నామని మంత్రి చెప్పారు. సాధారణ కీమోథెరపీ కోసం పేషెంట్లు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా వారి జిల్లాల్లోనే ట్రీట్మెంట్ అందేలా మ్యాపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జనవరి నాటికి 4 కొత్త మొబైల్ స్క్రీనింగ్ యూనిట్లను తీసుకురావాలని చెప్పారు.
ప్రభుత్వ చొరవ అభినందనీయం
రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ నివారణ, స్క్రీనింగ్, చికిత్సలో తీసుకుంటున్న చర్యలపై ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ను నోటిఫయబుల్ డిసీజ్ గా గుర్తించి ప్రత్యేక పోర్టల్ ప్రారంభించడం ద్వారా ఇప్పటివరకు దాదాపు 35 వేల కేసులు నమోదయ్యాయని, నియంత్రణ చర్యల్లో ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ పనులు స్పీడప్ చేయండి
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెండింగ్ పనులను స్పీడప్ చేయాలని మంత్రి దామోదర్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ ను సిద్ధం చేయాలన్నారు. సెక్రటేరియట్ లో ఆర్‌అండ్ బీ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ, టిమ్స్ అల్వాల్, టిమ్స్ ఎల్‌బీ నగర్ హాస్పిటల్ నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. వరంగల్ హాస్పిటల్ ను త్వరలోనే ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రతి ఫ్లోర్ ప్లాన్ ను మంత్రి పరిశీలించారు. తొలుత అవుట్ పేషెంట్ సేవలు ప్రారంభించనున్నందున రిజిస్ట్రేషన్ డెస్కులు, ఓపీ కన్సల్టేషన్ రూమ్‌లు, ఫార్మసీ, డయాగ్నస్టిక్స్ తదితర విభాగాల పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
