రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. బీజేపీ లీడర్లు, కేంద్రమంత్రి అమిత్ షా పగటి కలలు కంటున్నారు..!

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. బీజేపీ లీడర్లు, కేంద్రమంత్రి అమిత్ షా పగటి కలలు కంటున్నారు..!
  •     మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

కూసుమంచి/ ఖమ్మం రూరల్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ పాగా వేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా, ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. 

మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. కూసుమంచిలో రూ.45.50 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రి పనులను పరిశీలించారు. తెల్దారుపల్లిలో రూ.3.12 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

దమ్మాయిగూడెంలో 187 మందికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఏలువారిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాల్లో పాల్గొని, రూ.2.5 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు చేసినా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకరతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.