ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. ఏ ఏకాదశి ప్రత్యేకత ఆ ఏకాదశిదే. ఆశ్వయుజమాసం కృష్ణ పక్షంఅంటే దీపావళి పండుగ ముందు ఏకాదశి ప్రత్యేకత ఏమిటి.. అలాంటి పవిత్రమైన రోజు ఎప్పుడు వచ్చింది. ఆరోజు ఎలాంటి నియమాలు పాటించాలి.. మొదలగు విషయాలను తెలుసుకుందాం. . .!
దీపావళి పర్వదినానికి ముందు వచ్చే ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది. ఆశ్వయుజ కృష్ణ పక్షంలో వచ్చే ఈ ఏకాదశిని 'రమా ఏకాదశి'గా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. అయితే ఈ ఏడాది ఏకాదశి తిథి ఘడియలు రెండు రోజులు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి.. పండితులు ఏం చెబుతున్నారు.. మొదలగు విషయాలను తెలుసుకుందాం..
హిందూ పంచాంగం ప్రకారం.. ఆశ్వయుజ కృష్ణ పక్ష ఏకాదశి తిథి నవంబర్ 4, 2026 ఉదయం 11:03 గంటలకు ప్రారంభమై, నవంబర్ 5 ఉదయం 10:35 గంటలకు ముగుస్తుంది. తిథి రెండు రోజుల్లో ఉంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఏకాదశి వ్రతం విషయంలో బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున.. సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి ఉన్న రోజునే ఏకాదశి నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
ALSO READ : జ్యోతిష్యం: ధన త్రయోదశి చాలా శుభదినం.. ఏ రాశి వారు ఏ వస్తువులు కొనుగోలు చేయాలి..!
నవంబర్ 4న సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి లేదు. అదే నవంబర్ 5న సూర్యోదయ వేళకు ఏకాదశి తిథి విధిగా లభిస్తోంది. అందుకే ఉదయ తిధి ప్రకారం రమా ఏకాదశి వ్రతాన్ని నవంబర్ 5 గురువారం రోజే ఆచరించాలని పండితులు తేల్చిచెప్పారు. ఈ వ్రత విరమణ మరుసటి రోజు అంటే నవంబర్ 6న చేయాల్సి ఉంటుంది.
రమా ఏకాదశి పూజా ముహూర్తాలు
- ఏకాదశి తిథి బ్రహ్మ ముహూర్తం: నవంబర్ 5 ఉదయం 05:00 గంటల నుంచి ఉదయం 05:48 గంటల వరకు.
- అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:43 గంటల నుంచి మధ్యాహ్నం 12:26 గంటల వరకు.
- గోధూళి ముహూర్తం: సాయంత్రం 05:33 గంటల నుంచి సాయంత్రం 05:59 గంటల వరకు.
- ఏకాదశి ఉపవాసం విరమణ సమయం: నవంబర్ 6 ఉదయం 06.37 నుంచి 08.48 వరకు రమా ఏకాదశి
రమా ఏకాదశి విశిష్టత.. పూజాఫలం
పురాణాల ప్రకారం రమా అంటే లక్ష్మీదేవి అని పండితులు చెబుతున్నారు. మరో పురాణ గాథ ప్రకారం.. రమా శ్రీ సత్యనారాయణస్వామి ధర్మపత్ని కూడా. అందుకే సత్యనారాయణ వ్రతాల్లో ఆవాహన చేపేటప్పుడు రమా సహిత శ్రీ సత్యనారాయణస్వామి అని అంటారు. నారాయణ అంటే విష్ణుమూర్తే కదా మరి..!
విష్ణుమూర్తికి.. లక్ష్మీదేవికి ఏకాదశి తిథి అంటే చాలా ఇష్టం.. ఆరోజు ( నవంబర్5) లక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
పూజా వివరాలు
- ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తలస్నానం చేయాలి.
- రమా ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు దశమి రోజు నుంచి ఉపవాసాన్ని ప్రారంభించాలి.
- ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి.
- పూజా స్థలంపై విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచి 'పంచామృతం' అభిషేకం చేయాలి.
- పూలు, పసుపు, కుంకుమతో అర్చించి .. విష్ణు సహస్రనామం పఠించాలి. లేదా శ్రద్దగా విన్నా సరిపోతుంది.పూజలో కచ్చితంగా తులసి దళాలు ఉండేలా చూసుకోండి.
- విష్ణుమూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండాలి.
- విష్ణువును స్తుతిస్తూ భజనలు....భక్తి పాటలు పాడుతూ రాత్రంతా జాగారం చేస్తారు. భక్తులు సాయంత్రం సమయంలో సమీపంలోని విష్ణువు ఆలయాలను కూడా సందర్శించాలి
- ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయఅనేమంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయాలి.
రమా ఏకాదశి ( నవంబర్ 5) రోజు పాటించాల్సిన ఆచారాలు
- రమా ఏకాదశి నాడు ఉపవాస దీక్షను పాటించాలి.
- ఆరోగ్య కారణాలతో ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు.
- రమా ఏకాదశి నాడు ధాన్యాలు, పప్పులు, బియ్యం, ఉల్లిపాయలు , మాంసాహారం అసలు తినకూడదు.
- దశమి రోజు ( నవంబర్ 4) సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. దశమి రాత్రి సంపూర్ణ బ్రహ్మచర్యం పాటిస్తారు.
- ఉపవాసాన్ని ద్వాదశి ఘడియలు ముగిసేలోగా విరమించాలి. నిష్టగా ఉపవాసాన్ని చేస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని అని నమ్మకం .
- పూజా క్రతువులు ముగించి, బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇచ్చి.. ఉపవాసం విరమించాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
