మంత్రి పొన్నం ముందు భోరున ఏడ్చిన కండక్టర్ ప్రవళిక తల్లి !

మంత్రి పొన్నం ముందు భోరున ఏడ్చిన కండక్టర్ ప్రవళిక తల్లి !

మణుగూరు డిపో బస్సు కండక్టర్ ప్రవళిక మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ దగ్గర కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి మంత్రి నివాళులు అర్పించారు. ప్రవళిక తల్లిని పరామర్శించి వారికి ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో.. కూతురిని విగత జీవిగా చూసిన ప్రవళిక తల్లి మంత్రిని పట్టుకుని గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని శోకసంద్రంలోకి నెట్టేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం, ఆర్టీసీ నుంచి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుంచి కోటి రూపాయల ప్రమాద బీమా ప్రవళిక కుటుంబానికి అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం దగ్గర మణుగూరు డిపో ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రవల్లికకు, ప్రయాణికురాలి మధ్య గొడవ జరిగింది. ప్రయాణికురాలి కొడుకుకు ఆఫ్ టికెట్ కోసం 100 రూపాయల నోట్ ఇవ్వడంతో టికెట్కు సరిపడ చిల్లర ఇవ్వాలని కండక్టర్ ప్రవల్లిక ప్రయాణికురాలిని అడిగింది. ఇరువురి మధ్య ఈ విషయంలో లొల్లైంది. గొడవ ముదిరింది. బస్సు నుంచి కండక్టర్ ప్రవల్లికను ప్రయాణికురాలు బయటికి తోసేసింది.

దురదృష్టవశాత్తూ.. కండక్టర్ కాలు ఆర్టీసీ టైర్ కింద పడిపోయింది. కాలు విరిగింది. తీవ్ర గాయాల పాలైన ప్రవలిక దాదాపు పది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అశ్వాపురం పోలీసులు ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.