తలాపున గోదారి పారుతున్నా.. పొలాలు ఎడారి : కేటీఆర్

 తలాపున గోదారి పారుతున్నా.. పొలాలు ఎడారి : కేటీఆర్
  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అక్కసుతోనే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల పడావు: కేటీఆర్​
  • రైతులకు సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: తలాపున గోదావరి పారుతున్నా.. రాష్ట్రంలోని పొలాలు ఎడారిగా మారుతున్నాయని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను పడావు పెట్టిందని విమర్శించారు. రైతులకు సాగునీరు అందకుండా చేస్తున్నదని ఆరోపించారు. మంగళవారం తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ కవి మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

2024-25 సంవత్సరానికి చెమన్ సింగ్, 2025–-26 సంవత్సరానికి సంగిశెట్టి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్మారక పురస్కారాలు అందజేశారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో సేవలందించిన తిరునగరి దేవకిదేవి, కవ్వంపల్లి స్వామిని సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏడాది ఏడున్నర నెలల్లో గోదావరిలోకి 750 టీఎంసీలు, కృష్ణా నదిలోకి 258 టీఎంసీల నీళ్లు వచ్చాయని, దాదాపు వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని చెప్పారు. ‘నీళ్లు ఎత్తండి. రైతులను ఆదుకోండి అని మేము ప్రభుత్వాన్ని కోరాం. కానీ వారు మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా, ఇవాళ వాస్తవాలను బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు’ అని విమర్శించారు. గోదావరి జలాలను వినియోగించుకుని పొలాలకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రజల్లో చైతన్యం నింపిన పాట.. 

కష్టజీవుల పక్షాన నిలబడేవాడే నిజమైన కవి అని కేటీఆర్​ అన్నారు. గోదావరిఖని మట్టిలోనే ఏదో మహత్యం ఉందని, కన్నీటి చుక్కల నుంచి కత్తులు మొలిపించిన అద్భుత కవి మల్లావఝల సదాశివుడు అని కొనియాడారు. జలసాధన ఉద్యమ సమయంలో ఆయన రాసిన ‘తలాపున పారుతుంది గోదావరి’ పాట ప్రజల్లో చైతన్యం నింపిందని గుర్తుచేశారు. సదాశివుడు అజ్ఞాత సూర్యుడిలా తన పాత్ర పోషించారని అన్నారు.