అంతర్జాతీయ కార్మిక సంస్థ (International Labour Organization - ILO) ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మహిళల కార్పొరేట్ భాగస్వామ్యంపై దిమ్మతిరిగే నిజాలని బయటపెట్టింది. ‘విమెన్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్: స్కేలింగ్ సక్సెస్’ (Women in business and management: Scaling success) పేరుతో మంగళవారం (నవంబర్ 3) నాడు విడుదల చేసిన నివేదికలో.. భారతీయ మహిళల మేనేజ్మెంట్ అవకాశాలు, లింగ వేతన (Gender Pay Gap) వ్యత్యాసాలకు సంబంధించిన అసలు నిజాలు బయటకు వచ్చాయి.
34 దేశాల్లో 32 స్థానంలో భారత్.. పాక్, బంగ్లా కంటే ముందే:
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 34 ఆర్థిక వ్యవస్థలను విశ్లేషించగా, భారత్ తీవ్రంగా నిరాశపరిచింది. మొత్తం 34 దేశాల్లో భారత్ 32వ స్థానంలో (చివరి నుంచి మూడో స్థానం) నిలిచింది. ఇండియా కంటే వెనుక కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల వాటా కేవలం 12 శాతం కంటే తక్కువగా ఉండటం కార్పొరేట్ రంగానికి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి..
వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఇదే:
* సీనియర్, మిడిల్ మేనేజ్మెంట్ (Senior & Middle Management): భారత్లో ఇది 11.9 శాతం మాత్రమే.. పొరుగున ఉన్న నేపాల్ (13 శాతం), జపాన్ (13 శాతం) ల కంటే భారత్ చాలా వెనుకబడిపోగా.. పాకిస్తాన్ (8 శాతం), బంగ్లాదేశ్ (7 శాతం) లతో పోలిస్తే కొద్దిగా ముందంజలో ఉన్నాం.
* పూర్తి మేనేజ్మెంట్ (All Management): భారత్లో ఇది 11.7 శాతంగా నమోదైంది. నేపాల్ (13 శాతం), జపాన్ (16 శాతం) లలో మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తుండగా.. పాకిస్తాన్ (6 శాతం), బంగ్లాదేశ్ (6 శాతం) లలో అత్యంత తక్కువగా ఉంది.
గంటకు 28 శాతం కంటే తక్కువ జీతం:
* పదవుల ప్రాతినిధ్యంలోనే కాదు.. పురుషులతో పోలిస్తే మహిళలకు ఇచ్చే వేతనాల్లోనూ చాలా వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ILO నివేదిక ప్రకారం, భారతదేశంలో మహిళా ఉద్యోగులు పురుషుల కంటే గంటకు సగటున 28 శాతం తక్కువ వేతనాన్ని పొందుతున్నారు.
* అధ్యయనం చేసిన 23 ఆసియా-పసిఫిక్ ఆర్థిక వ్యవస్థలలో టోంగా (సుమారు 64 శాతం), సౌత్ కొరియా (సుమారు 41 శాతం), వనాటు (ద్వీప దేశం సుమారు 29%) తర్వాత అత్యధిక లింగ వేతన వ్యత్యాసం (Gender Wage Gap) ఉన్న 4వ దేశంగా భారత్ నిలిచింది.
* అయితే, మేనేజర్ హోదాలో ఉన్నవారి విషయానికొస్తే భారతదేశంలో లింగ వేతన వ్యత్యాసం (Gender pay gap) దాదాపు సున్నాకి దగ్గరగా ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం.
