ములుగు జిల్లాలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. జిల్లా వ్యాప్తంగా పలుషాపుల్లో అక్రమంగా మద్యం కల్తీ చేస్తూ అక్రమంగా విక్రయిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ మద్యంపై ఎక్సైజ్ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. పలు వైన్స్ షాపులపై దాడులు చేసి కల్తీ మద్యాన్ని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ములుగు జిల్లాకేంద్రంలోని పలు వైన్స్ షాపులపై బుధవారం (నవంబర్4) ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక రెడ్డి వైన్సులపై ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు.. కల్తీ మద్యాన్ని సీజ్ చేశారు.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు, కల్తీ మద్యం తయారీ, సరఫరాకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేపట్టారు. మద్యం కల్తీ వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
