మురసు తుఫాన్ ప్రభావంతో కోస్తాలో భారీ వర్షాలు పడ్డాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రెండు రోజులుగా పడిన వర్షంతో.. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటెత్తింది. నిన్నా మొన్నటి వరకు నీళ్లు లేక అడుగంటిన బ్యారేజ్.. మురసు తుఫాన్ ప్రభావంతో పడిన వర్షంతో.. భారీ ఎత్తున నీళ్లు వచ్చి చేరాయి.
ఈ క్రమంలోనే ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం అమాంతం పెరిగింది. పూర్తి స్థాయికి నీటి మట్టం చేరటంతో.. బ్యారేజ్ కు ఉన్న 70 గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. 2026, నవంబర్ 14వ తేదీ ఉదయం బ్యారేజ్ గేట్లు ఎత్తి.. 71 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ నీళ్లు అంతా సముద్రంలో కలవనున్నాయి.
ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్ లోకి వస్తున్న వరదతో.. బ్యారేజ్ నీటి మట్టం 12 అడుగులకు చేరింది. ఇది గరిష్ఠ నీటి నిల్వ స్థాయి. ఈ క్రమంలోనే బ్యారేజ్ 30 గేట్లను రెండు అడుగుల ఎత్తు వరకు.. మరో 40 గేట్లను ఒక్క అడుగు ఎత్తారు. మొత్తం 70 గేట్ల నుంచి 71 వేల క్యూసెక్కుల నీటిని బయటకు పంపించారు అధికారులు. మరికొంత నీటిని కృష్ణా కాలువల్లోకి వదిలారు.
ప్రకాశం బ్యారేజ్ క్యాచ్ మెంట్ ఏరియా ( పరివాహక ప్రాంతం) అయిన తిరువూరులో 16 సెంటిమీటర్లు, మైలవరంలో 12 సెంటిమీటర్లు, ఎ.కొండూరులో 10 సెంటిమీటర్ల వర్షం పడింది. అదే విధంగా విజయవాడలోనూ 10 సెంటిమీటర్లపైనే వర్షపాతం నమోదు అయ్యింది. ఈ నీళ్లు అంతా బ్యారేజ్ లోకి రావటంతో.. బ్యారేజ్ గరిష్ఠ స్థాయికి చేరింది. ఇదే సమయంలో ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో.. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఓపెన్ చేసి.. నీళ్లను దిగువకు పంపిస్తున్నారు అధికారులు.
