రైళ్లలో ప్రయాణించే వారికి అలర్ట్. 2027 జనవరి 1 నుంచి భారతీయ రైల్వే కీలక మార్పులు చేయనుంది. ముఖ్యంగా ఉత్తర రైల్వే పరిధిలో నడిచే 18 రైళ్లకు సూపర్‌ఫాస్ట్ హోదా తొలగించి, సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చనున్నారు. అంతేకాదు.. ఈ రైళ్లకు కొత్త నంబర్లు కూడా కేటాయించనున్నారు.
ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు కొంత రిలీఫ్ కలగనుంది. ఇప్పటివరకు సూపర్‌ఫాస్ట్ రైళ్లకు టికెట్ ధరతో పాటు అదనంగా సూపర్‌ఫాస్ట్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇకపై ఈ 18 రైళ్లకు ఆ అదనపు ఛార్జీ ఉండదు. దీంతో టికెట్ ధర కొంత తగ్గనుంది. ఢిల్లీ, బీహార్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులపై ఈ మార్పుల ప్రభావం ఉంటుంది.
ఈ రైళ్లకు సూపర్‌ఫాస్ట్ హోదా ఎందుకు తొలగిస్తున్నారంటే
రైల్వే నిబంధనల ప్రకారం.. ఒక రైలుకు సూపర్‌ఫాస్ట్ హోదా రావాలంటే బ్రాడ్ గేజ్ మార్గంలో ప్రయాణించే సమయంలో గంటకు కనీసం 55 కిలోమీటర్ల సగటు వేగం ఉండాలి. అయితే ఉత్తర రైల్వే పరిధిలోని ఈ 18 రైళ్ల సగటు వేగం ఈ నిబంధన కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాటిని సూపర్‌ఫాస్ట్ కేటగిరీ నుంచి సాధారణ ఎక్స్‌ప్రెస్ కేటగిరీలోకి మార్చాలని నిర్ణయించారు. రైలుకు ఎక్కువ స్టాపులు ఉండటం, రైల్వే ట్రాక్‌లపై రద్దీ, మధ్యలో ఎక్కువసేపు ఆగాల్సి రావడం వంటి కారణాలతో సగటు వేగం తగ్గుతుంది. అందుకే ఈ రైళ్ల క్యాటగిరిలో మార్పులు చేస్తున్నారు.
టికెట్ ధర ఎంత తగ్గుతుందంటే
ఈ 18 రైళ్లు సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారిన తర్వాత సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీ వసూలు చేయరు. దీంతో ప్రయాణికులకు డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంది. స్లీపర్ క్లాస్ రూ.30, ఏసీ 3 టైర్ రూ.45, ఏసీ 3 టైర్(ఎకానమీ) రూ.45, ఏసీ 2 టైర్ రూ.45, ఏసీ చైర్ కార్ రూ.45, ఫస్ట్ ఏసీ రూ.75, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.75 చార్జీలు తగ్గనుంది.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సాధారణ టికెట్ ఛార్జీలు తగ్గడం లేదు. సూపర్‌ఫాస్ట్ రైళ్లకు అదనంగా వసూలు చేసే ఛార్జీ మాత్రమే తొలగిస్తున్నారు. 2027 జనవరి 1 నుంచి ఈ 18 రైళ్లు కొత్త నంబర్లతో నడవనున్నాయి. పాత నంబర్ల స్థానంలో కొత్త నంబర్లు అమల్లోకి వస్తాయి.
కర్ణాటక రైళ్లకు కూడా కొత్త నంబర్లు
ఉత్తర రైల్వే పరిధిలోని రైళ్లతో పాటు, నైరుతి రైల్వే పరిధిలోని కొన్ని రైళ్లకు కూడా కొత్త నంబర్లు కేటాయించారు. అయితే వీటిలో కొన్ని రైళ్లకు మాత్రమే సూపర్‌ఫాస్ట్ హోదాలో మార్పు ఉంటుంది. మిగతా వాటికి నంబర్లు మాత్రమే మారనున్నాయి. ముఖ్యంగా మైసూరు – బెళగావి మధ్య నడిచే విశ్వమానవ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ హోదాను కోల్పోనుంది. ముఖ్యంగా గరీబ్ రథ్ రైళ్లు కార్వార్, ఉడుపి, మంగళూరు మీదుగా ప్రయాణిస్తాయి. కాబట్టి కర్ణాటక తీర ప్రాంత ప్రయాణికులు కూడా ఈ కొత్త నంబర్లను గుర్తుంచుకోవాలి.
జనవరి 2027 నుంచి రైలు ప్రయాణాలు చేయాలనుకునేవారు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి:
*టికెట్ బుక్ చేసుకునే ముందు రైలు కొత్త నంబర్‌ను చెక్ చేసుకోవాలి.
*పాత రైలు నంబర్లతో సెర్చ్ చేస్తే కొత్త వివరాలు కనిపించకపోవచ్చు.
*ఇప్పటికే సేవ్ చేసుకున్న రైలు వివరాలను మరోసారి పరిశీలించాలి.
*కర్ణాటక రైళ్ల విషయంలో జనవరి 1, 2, 3, 4 తేదీలను ప్రత్యేకంగా గమనించాలి.
*రైళ్ల కొత్త నంబర్లు, సమయాలు, ప్రయాణ వివరాల కోసం రైల్వే అధికారిక NTES వెబ్సైట్ లేదా యాప్‌ను చెక్ చేయవచ్చు. అలాగే 139 హెల్ప్‌లైన్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
రైల్వేలో ఈ మార్పులు ఎందుకు?
రైళ్ల వేగం, ప్రయాణ సమయం, రద్దీ, స్టాపుల సంఖ్య వంటి అంశాలను భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఈ వివరాల ఆధారంగానే రైళ్ల వర్గీకరణలో మార్పులు చేస్తుంది. సూపర్‌ఫాస్ట్ హోదా అనేది రైలు ఎంత వేగంగా వెళ్లగలదనే దానిపై మాత్రమే కాకుండా, మొత్తం ప్రయాణంలో సగటు వేగంపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే నిర్దేశించిన స్పీడ్ అందుకోలేని రైళ్లకు సూపర్‌ఫాస్ట్ హోదాను తొలగిస్తున్నారు. కాబట్టి కొత్త ఏడాది నుంచి రైలు ప్రయాణాలు ప్లాన్ చేసుకునేవారు కొత్త నంబర్లు, టికెట్ ఛార్జీల వివరాలను ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది.
