ఆ మేక ఒంటి నిండా డబ్బు కట్టలు : చనిపోయి కనిపించిన తర్వాత సీరియస్ కేసు

ఆ మేక ఒంటి నిండా డబ్బు కట్టలు : చనిపోయి కనిపించిన తర్వాత సీరియస్ కేసు

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వింత, బాధాకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంటికి డాలర్ నోట్లు టేపుతో అంటించి ఉన్న ఓ మేక పిల్ల రోడ్లపై పరుగులు తీస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, చివరకు ఆ మేక పిల్ల చనిపోయినట్లు సమాచారం. దింతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

ఫ్లోరిడాలోని హియాలియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 'వాలర్' అనే పేరున్న ఈ మేక పిల్ల శరీరమంతా డాలర్ నోట్లను టేపుతో అంటించి ఉన్నట్లు వీడియోలో కనిపించింది. పార్కింగ్ స్థలంలో, కార్లు తిరుగుతున్న రోడ్లపై అది భయంతో పరుగులు తీస్తూ కనిపించింది. వాహనాలను తప్పించుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.

కారు ఢీకొని మేక పిల్ల మృతి
వెస్ట్‌ల్యాండ్ మాల్ సమీపంలో ఈ మేక పిల్ల చనిపోయి కనిపించినట్లు సమాచారం. కారు ఢీకొనడం వల్లే అది చనిపోయినట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే అసలు ఏం జరిగింది ? దాని ఒంటికి డబ్బులు ఎవరు అంటించారు ? అది అక్కడికి ఎలా వచ్చింది ? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనపై హియాలియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మేక పిల్ల శరీరానికి డాలర్ నోట్లు ఎవరు అంటించారు ? దానిని అక్కడ వదిలేసింది ఎవరు ? అనే విషయాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. జంతువుపై హింసకు సంబంధించిన కేసుగా ఈ ఘటనను పరిశీలిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూగజీవితో ఇంత దారుణంగా వ్యవహరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నిందితుల ఆచూకీ చెబితే రూ.10 వేల డాలర్ల బహుమతి!
ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించేందుకు మయామి బీచ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ముందుకొచ్చారు. నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడే సమాచారం అందించిన వారికి 10 వేల అమెరికన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.

సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఆ మేక పిల్లను ఎవరూ ఎందుకు కాపాడలేకపోయారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు, ఈ ఘటన వెనుక ఏదైనా ఆచారం లేదా మతపరమైన కారణం ఉందా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు అలాంటి విషయాలేవీ అధికారికంగా నిర్ధారణ కాలేదు. మొత్తానికి ఒంటినిండా డబ్బులు అంటించి ఉన్న మేక పిల్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన వెనుక అసలు నిజాలు ఏమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.