పెన్నుకు బ్లేడ్ పెట్టి షేవింగ్ చేసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

పెన్నుకు బ్లేడ్ పెట్టి షేవింగ్ చేసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే..  వీడియో వైరల్

నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం షేవింగ్ వీడియో వైరల్ గా మారింది.  రేసర్ బ్లేడ్ సెట్ పాడైపోవడంతో.. ఏకంగా పెన్నుకు బ్లేడ్ అమర్చుకుని షేవింగ్ చేసుకున్నారు. ఈ తతంగాన్నంతా ఆయన భార్య వేముల పుష్ప తన మొబైల్ కెమెరాలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

హోదా ఎంత పెద్దదైనా.. పని పూర్తి చేసుకోవడమే ముఖ్యం, ఆర్భాటాలు కాదన్నట్లుగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా సర్దుకుపోవాలో చెప్పేందుకే వీడియో పోస్ట్ చేసినట్లు పుష్ప వెల్లడించారు. 

ప్రభుత్వ విప్ హోదాలో ఉన్నా.. సాధారణ వ్యక్తిలా అందుబాటులో ఉన్న వస్తువులతో పని పూర్తి చేసుకున్న వైనం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నైంటీస్ లో గ్రామాల్లో ఇలాంటి సీన్స్ కనిపించేవని చెబుతున్నారు. రవాణా సదుపాయం అంతంతగా ఉన్న ఆ సమయంలో .. టౌన్ కు వెళ్లలేక.. పెన్నుకు, కట్టె పుల్లకు బ్లేడు పెట్టి షేవింగ్ చేసుకునే వాళ్లు అని గుర్తు చేసుకుంటున్నారు.