SAI Funding Row: యూరోపియన్ బ్యాడ్మింటన్ టూర్ ముగింపు దశలో భారత షట్లర్లు పీవీ సింధు (PV Sindhu), లక్ష్యసేన్ (Lakshya Sen) సంచలన ప్రదర్శనతో జర్మనీలో జరిగిన హైలో ఓపెన్ (Hylo Open) సింగిల్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయాల వెనుక టీమిండియా ప్లేయర్స్ ఎదుర్కొన్న తీవ్రమైన నిరాశ, ఆర్థిక ఇబ్బందుల కథ బయటపడటంతో క్రీడా ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. యూరోపియన్ సిరీస్‌లోని నాలుగు టోర్నమెంట్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నుంచి రావాల్సిన ఫండింగ్ ఆగిపోవడంతో, మన స్టార్ ఆటగాళ్లంతా తమ సొంత డబ్బులతోనే టోర్నమెంట్లు ఆడేందుకు వెళ్లాల్సి వచ్చింది.
షాక్‌కు గురయ్యాను.. ఆటను ఆపలేదు: సింధు ఎమోషనల్
అక్టోబర్ 6వ తేదీన ఫిన్‌లాండ్‌లో ఆర్కిటిక్ ఓపెన్ ప్రారంభం కావడానికి కేవలం కొద్ది రోజుల ముందు మాత్రమే ఫండింగ్ నిలిపివేస్తున్నట్లు ఆటగాళ్లకు సమాచారం అందింది. ఈ పరిణామంపై ఒలింపిక్ విజేత పీవీ సింధు మాట్లాడుతూ.. నాకు ఈ విషయం తెలిసినప్పుడు తీవ్రమైన షాక్‌కు గురయ్యాను.. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు.. కానీ ఫండింగ్ లేదని ఆటను ఆపేయలేను కదా! నా ఫోకస్ అంతా నా ప్రదర్శనపైనే పెట్టాను.. నా వ్యక్తిగత ఖర్చులను నేనే భరించాను, ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (OGQ) కూడా నాకు కొంత సహాయం చేసిందని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కి పీవీ సింధు తెలిపింది.
కోచ్‌లు లేకుండానే టోర్నీ ఆడిన భారత ప్లేయర్స్:
ఫండింగ్ లేకపోవడంతో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) ఫిన్‌లాండ్ తొలి టోర్నీకి మాత్రమే వసతి కల్పించింది. ఆ తర్వాత ఫ్రాన్స్, డెన్మార్క్, జర్మనీ టోర్నీలకు ప్రయాణం, తిండి, వసతి ఖర్చులను ప్లేయర్లే భరించుకోవాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొందరు ప్లేయర్లు తమ వ్యక్తిగత కోచ్‌లను కూడా వెంట తీసుకెళ్లలేకపోయారు. ఫ్రాన్స్ ఓపెన్‌లో ప్రపంచ 3వ ర్యాంకర్ అకానె యామగుచిని ఓడించిన అస్మిత చాహెలియాకు ఆమె సహచర క్రీడాకారిణి ఇషారాణి బరువా కోచింగ్ కార్నర్‌లో నిలబడింది. తన్వి శర్మ కూడా డెన్మార్క్ ఓపెన్‌లో కోచ్ లేకుండానే బరిలోకి దిగాల్సి వచ్చిందని సింధు వెల్లడించింది.
అసలు ఫండింగ్ ఎందుకు ఆగింది?: SAI వర్గాల క్లారిటీ
ఐచి-నాగోయాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు తీవ్ర నిరాశపరచడం వల్లే ఫండింగ్ ఆపేశారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ఆరోపణలను SAI సీనియర్ అధికారి ఖండించారు. టోర్నీకి 30 రోజుల ముందు బీఏఐ (BAI) ప్రతిపాదనలు, ప్లేయర్ల జాబితాను పంపాల్సి ఉంది.. కానీ బీఏఐ సమయానికి ఫైల్స్ సమర్పించకపోవడం వల్లే ఫండింగ్ నిలిచిపోయిందని తేల్చి చెప్పింది. రాబోయే టోర్నీలకు ఫండింగ్ పునరుద్ధరించామని చెప్పినప్పటికీ.. ఆటగాళ్లు ఇప్పటికే తమ సొంత జేబుల నుంచి పెట్టుకున్న ఖర్చులను మాత్రం రీ-ఇంబర్స్ (తిరిగి చెల్లించడం) చేయబోమని చెప్పడం గమనార్హం.
కష్టాలను తట్టుకుని రికార్డు టైటిళ్లు:
* పీవీ సింధు: ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్‌గా నిలవడంతో పాటు హైలో ఓపెన్ టైటిల్ సాధించింది. 2017 తర్వాత ఒకే ఏడాదిలో రెండు బీడబ్ల్యూఎఫ్ (BWF World Tour) సూపర్ 500+ టైటిళ్లు గెలవడం సింధుకు ఇదే తొలిసారి. దీనితో ఆమె మళ్లీ వరల్డ్ నంబర్-6 ర్యాంక్‌కు దూసుకెళ్లింది.
* లక్ష్యసేన్: ఏడాది కాలంగా టైటిల్ లేక తీవ్ర ఒత్తిడిలో ఉన్న లక్ష్యసేన్.. జర్మనీలో పురుషుల సింగిల్స్ ట్రోఫీ గెలిచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
