డబుల్ ఇంజిన్ సర్కార్‌కు డబుల్ ఓటమి:వారణాసిలో ఎస్పీ ఘనవిజయంపై అఖిలేష్ యాదవ్ 

డబుల్ ఇంజిన్ సర్కార్‌కు డబుల్ ఓటమి:వారణాసిలో ఎస్పీ ఘనవిజయంపై అఖిలేష్ యాదవ్ 

వారణాసి: ఉత్తరప్రదేశ్ శాసన మండలి (MLC) ఎన్నికల్లో వారణాసి గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలవడం పట్ల ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడూ డబుల్ ఇంజిన్ సర్కార్  అని మాట్లాడే వారికి ఈ ఫలితాలు డబుల్ ఓటమి అని సెటైర్లు వేశారు.ఇటీవల జరిగిన యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానిమోదీ నియోజకవర్గం వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ (SP) అభ్యర్థులు అశుతోష్ సిన్హా, లాల్ బిహారీ యాదవ్ ఘనవిజయం సాధించడం బీజేపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.  

వారణాసిలో మంగళవారం అఖిలేష్ యాదవ్​ మీడియాతో మాట్లాడుతూ..తమ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.బాబా విశ్వనాథ్ ఆశీస్సులు తమకు రెండుసార్లు అందాయని, అందుకే ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. అయితే ఈ విజయం పట్ల తాము గర్వంగాలేమని స్పష్టం చేశారు. కానీ డబుల్ ఇంజిన్, డబుల్ స్పీడ్, డబుల్ డెవలప్‌మెంట్ అని ప్రగల్భాలు పలికే వారికి ఇప్పుడు డబుల్ ఓటమి ఎదురైంది. వారికి డబుల్ లాస్, డబుల్ జీరో మిగిలాయి" అని అఖిలేష్ ఎద్దేవా చేశారు.

వారణాసి సిటీపట్ల ప్రభుత్వం అనుసరించిన తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అఖిలేష్​ ఆరోపించారు.మణికర్ణిక ఘాట్ దగ్గర కూల్చివేతలు, పాల్ కమ్యూనిటీ సభ్యులపై లాఠీచార్జ్ వంటి ఘటనలను అఖిలేష్​ గుర్తు చేశారు. ఆధ్యాత్మిక నగరమైన వారణాసి సంస్కృతిని, వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు ప్రయత్నించారని, దానికి ప్రజలు తమ ఓటుతో తగిన సమాధానం చెప్పారని విమర్శించారు.

ఇదిలా ఉండగా.. యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 స్థానాలకుజరిగిన ఎన్నికల్లో బీజేపీ 6 స్థానాలను, సమాజ్​ వాదీ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించాయి. అగ్రా గ్రాడ్యుయేట్​, బరేలీ–మురదాబాద్​ టీచర్​, లక్నో టీచర్, మీరట్​ టీచర్​, మీరట్ గ్రాడ్యుయేట్​, గోరఖ్‌పూర్-ఫైజాబాద్ టీచర్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. అలహాబాద్-ఝాన్సీ గ్రాడ్యుయేట్, వారణాసి టీచర్, ఆగ్రా-అలీఘర్ టీచర్ స్థానాల్లో ఎస్పీ జయకేతనం ఎగురవేసింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఎస్పీ అభ్యర్థులు గెలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.