మలక్ పేటలో దొంగల ముఠా గుట్టురట్టు..నిందితులపై 98 క్రిమినల్ కేసుల చరిత్ర..23 సెల్‌ఫోన్లు స్వాధీనం

మలక్ పేటలో దొంగల ముఠా గుట్టురట్టు..నిందితులపై  98 క్రిమినల్ కేసుల చరిత్ర..23 సెల్‌ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్: మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గడ్డిఅన్నారం పోచమ్మ బస్తీలో మహిళపై కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్ దోపిడీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను మలక్‌పేట పోలీసులు, కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేసింది. వారి నుంచి బాధితురాలి ఫోన్‌తో పాటు మరో 22 సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 27న సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి తప్పుడు కారణం చెప్పి బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, వన్‌ప్లస్ సెల్‌ఫోన్‌తో పరారయ్యాడు. గాయపడిన మహిళను చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు.సీసీటీవీ ఫుటేజీలు, స్థానికుల విచారణ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు నవంబర్ 2న గడ్డిఅన్నారం ఎక్స్‌రోడ్డు వద్ద ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి సమాచారంతో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

నిందితులను కేసరి మణికంఠ అలియాస్ మున్నా (27), నారపోగు వంశీకృష్ణ అలియాస్ నల్లి (28), అజయ్ కుమార్ (28)గా గుర్తించారు. వీరిలో మణికంఠపై సుమారు 59, వంశీకృష్ణపై 39 క్రిమినల్ కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. 

నిందితులకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చోరీ కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని నేరాల్లో వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. అదనపు చోరీ సొత్తును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.