- రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చిన జిల్లాల్లోనూ కనిపించని ఎఫెక్ట్
- అర్నబ్ తుఫాను టైంలోనూ ఇదే పరిస్థితి
హైదరాబాద్, వెలుగు: 2 తుఫాన్లు వచ్చాయి. మనకు అనుకూలంగా ఉండే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఏర్పడ్డాయి. అయినా ఏం ప్రయోజనం? చిన్న చిన్న వర్షాలే తప్ప వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా ఒక్క పెద్ద వాన కూడా కురిపించలేకపోయాయి. గత నెల 28న అర్నబ్తుఫాను, ఈ నెల 1న ఏర్పడిన మురసు తుఫాను మన రాష్ట్రంలో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఈ 2 తుఫాన్లతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు కొంచెమైనా తగ్గుతాయని ఆశించినా ఆశలు అడియాసలే అయ్యాయి.
అర్నబ్జోరుతో జోర్దార్వానలు పడతాయని ఐఎండీ అలర్ట్స్ఇచ్చినా హైదరాబాద్మినహా ఎక్కడా చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు పడలేదు. మురసుతో నల్గొండ, నాగర్కర్నూల్జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్అలర్ట్స్తో వార్నింగ్ ఇచ్చినా ఆ అంచనాలూ నిజం కాలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయే తప్ప.. రెడ్ అలర్ట్ స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా వర్షం పడలేదు.
కొన్ని జిల్లాల్లోనే ప్రభావం
మంగళవారం మురసు ఎఫెక్ట్ నల్గొండ, నాగర్కర్నూల్ జిల్లాలపై తీవ్రంగా ఉంటుందని ఐఎండీ అలర్ట్స్లో పేర్కొంది. రెడ్వార్నింగ్ ఇచ్చింది. కానీ, ఆ 2 జిల్లాల్లో చుక్క వర్షం కూడా పడలేదు. పొడి వాతావరణ పరిస్థితులే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ప్రభావం కొంచెం ఎక్కువగా కనిపించింది. అత్యధికంగా అశ్వారావుపేటలో 6.8 సెంటీమీటర్ల వర్షం పడింది. నాయుడుపేటలో 6 సెంటీమీటర్లు, వేంసూరులో 5.9, భద్రాద్రి జిల్లా మల్కారంలో 5.9, ఖమ్మం జిల్లా జేవీఆర్ ఓసీపీలో 5.3, సదాశివునిపాలెంలో 5.3, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 5.1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మందలపల్లిలో 4.8, అంకంపాలెంలో 4.4, ఖమ్మం జిల్లా మధిరలో 4.3, సత్తుపల్లిలో 4.3, పెనుబల్లిలో 4.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోనూ వర్షం ముసురుకే పరిమితం అయింది.
ఎల్నినో ఎఫెక్టే కారణం
రాష్ట్రంపై తుఫాన్ల ప్రభావం ఉంటుందని అంచనా వేసినా.. దాని ప్రభావం లేకపోవడానికి కారణం ఎల్నినో ఎఫెక్టేనని ఎక్స్పర్ట్స్చెబుతున్నారు. ఇప్పటికే తిష్టవేసిన ఎల్నినో ఇప్పుడు మరింత బలంగా తయారవుతున్నదని, దాని వల్లే తుఫాను దిశ మారుతున్నదని అంటున్నారు. అందువల్లే ముందుగా అంచనా వేసినట్టుగా ఆయా జిల్లాల్లో వర్షాలు పడడం లేదని పేర్కొంటున్నారు. ఇక నుంచి ఎండలు మండిపోతాయని స్పష్టం చేస్తున్నారు. తాజాగా బుధవారానికి ఐఎండీ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కానీ వర్షాలు ఏ మేరకు పడతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
