మెట్రోకు మొదట మద్దతిచ్చింది సీపీఐనే : కె.నారాయణ 

మెట్రోకు మొదట మద్దతిచ్చింది సీపీఐనే : కె.నారాయణ 
  • ‘మేఘ పథం’ పుస్తకంలో మా ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యం: కె.నారాయణ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రోకు మొదట బేషరతుగా మద్దతిచ్చింది సీపీఐ పార్టీయేనని ఆ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ తెలిపారు. మెట్రో మాజీ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రాసిన ‘మేఘ పథం’ పుస్తకంలో తమ పార్టీ ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ హయాంలో మెట్రో ప్రతిపాదన వచ్చినప్పుడు పలువురు వ్యతిరేకించినా.. నగర భవిష్యత్ రవాణా అవసరాలను గుర్తించి సీపీఐ మద్దతిచ్చిందన్నారు.

అప్పట్లో ఎన్వీఎస్ రెడ్డి తమ పార్టీ కార్యాలయానికి వచ్చి మద్దతు కోరారని చెప్పారు. మెట్రోను ఆపుదామని, ప్రకటన చేద్దామని అప్పటి ప్రతిపక్ష నేత కేసీఆర్ తనకు ఫోన్ చేశారని, తాను ఒప్పుకోలేదని గుర్తుచేశారు. ప్రాజెక్టును వ్యతిరేకించినవారి వివరాలు పుస్తకంలో రాసిన ఎన్వీఎస్ రెడ్డి.. మద్దతిచ్చిన సీపీఐ పాత్రను ప్రస్తావించలేదన్నారు. పండుగలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ విమానయాన సంస్థలు టికెట్ ధరలు భారీగా పెంచుతున్నాయని నారాయణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని చార్జీలను నియంత్రించాలని, ధరల నిర్ణయంలో పారదర్శకత తీసుకొచ్చి సామాన్య ప్రయాణికులకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.