సైబర్ నేరాలపై మూకుమ్మడి పోరు చేయాలి : డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌

సైబర్ నేరాలపై మూకుమ్మడి పోరు చేయాలి : డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌
  • ఐసీసీసీలో జాయింట్‌‌‌‌ సైబర్ క్రైమ్‌‌‌‌ కోఆర్డినేషన్ మీటింగ్‌‌‌‌
  •     హాజరైన 13 రాష్ట్రాల ఆఫీసర్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతినిధులు

హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలపై అన్ని రాష్ట్రాల పోలీసులు, దర్యాప్తు సంస్థలు మూకుమ్మడి పోరు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. వ్యవస్థీకృత పరిశ్రమగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన గత రెండు సమీక్షల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. 2024–-25లో దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులు 24 శాతం పెరగగా, తెలంగాణలో మాత్రం 3 శాతం తగ్గాయని, బాధితుల ఆర్థిక నష్టాలు 4 శాతం తగ్గితే, రాష్ట్రంలో మాత్రం 20 శాతం తగ్గినట్లు వెల్లడించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) సమన్వయంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌‌‌బీ) మంగళవారం బంజారాహిల్స్‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో జాయింట్‌‌‌‌ సైబర్ క్రైమ్‌‌‌‌ కోఆర్డినేషన్ టీమ్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ నిర్వహించింది. 

ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, గోవా, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, కేరళం, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కు చెందిన అధికారులు, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ, సీబీఐ, ఈడీ సహా కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతినిధులు, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌యూ) ప్రొఫెసర్, క్వాడ్ కమిషనరేట్‌‌‌‌ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సైబర్ నేరం జరిగిన తర్వాత డబ్బు రికవరీ చేయడం నుంచి, నేరాన్ని నిరోధించే దిశగా పోలీసులు, దర్యాప్తు సంస్థలు పనిచేయాలన్నారు. సైబర్ నేరగాళ్లు బాధితుడిని చేరే మార్గం, ఫోన్ నంబర్, ఉపయోగించుకునే ఖాతా అందకుండా చేయాలని సూచించారు. ఈ సమావేశం సిఫార్సులను ఢిల్లీకి తీసుకెళ్లి, దేశవ్యాప్తంగా ఏకీకృత చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

స్కామ్ కాంపౌండ్లు ఇతర దేశాలకు తరలిపోతున్నయ్​

ఐ4సీ సీఈవో రాజేశ్​కుమార్ మాట్లాడుతూ.. స్కామ్ కాంపౌండ్లు ఆగ్నేయాసియా నుంచి ఆఫ్రికా, శ్రీలంక, ఇతర దేశాలకు తరలిపోతున్నాయని అన్నారు. ఏకీకృత దర్యాప్తు వేదిక, అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేసే అధికారం, బ్యాంకులకు ఇచ్చే ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌‌‌‌వోపీ) అవసరమని చెప్పారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీజీసీఎస్‌‌‌‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ.. బ్యాంక్​అకౌంట్లను బ్లాక్ చేస్తూ, స్కామ్ కేంద్రాలను ధ్వంసం చేస్తున్నప్పటికీ, సైబర్​నేరాల సూత్రధారులు చిక్కడం లేదన్నారు. నేరగాళ్లు ఒకే నెట్‌‌‌‌వర్క్‌‌‌‌గా పనిచేస్తుంటే పోలీసులు, దర్యాప్తు సంస్థలు మాత్రం అధికార పరిధులకే పరిమితమైనట్లు పేర్కొన్నారు. కేసుల వారీ దర్యాప్తు నుంచి, రియల్ టైమ్ సమాచార మార్పిడి, బహుళ రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్లతో కూడిన కోఆర్డినేషన్, ఇంటెలిజెన్స్ ఆధారిత విధానం వైపు మారడమే సమావేశలక్ష్యమని తెలిపారు.